భారీ స్టీల్ ప్లాంట్ నిర్మాణం రాష్ట్రానికి గర్వకారణం - యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు

 భారీ స్టీల్ ప్లాంట్ నిర్మాణం రాష్ట్రానికి గర్వకారణం - యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు - కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి వెల్లడి 

అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ – నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న భారీ స్టీల్ ప్లాంట్ నిర్మాణం రాష్ట్రానికి గర్వకారణమని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర మంత్రి కుమారస్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కీలక మైలురాయి అని అన్నారు. సుమారు రూ.1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుందని తెలిపారు. 5,465 ఎకరాల్లో రెండు దశల్లో అమలు చేయనున్న ఈ ప్లాంట్ ద్వారా లక్షకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని, ముఖ్యంగా స్థానిక యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కేవలం ఉక్కు తయారీకి పరిమితం కాకుండా, స్కిల్ డెవలప్మెంట్, టెక్నికల్ ట్రైనింగ్, అనుబంధ పరిశ్రమల ద్వారా యువతకు దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలు కల్పించనున్నదని వివరించారు. ఎంఎస్ఎంఈలు, చిన్న పరిశ్రమలు కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా అభివృద్ధి చెందుతూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తాయని అన్నారు. మంత్రి నారా లోకేష్ కృషి ఈ ప్రాజెక్ట్ వెనుక ప్రధాన శక్తిగా నిలిచిందని ఎమ్మెల్యే కొనియాడారు. పెట్టుబడిదారులతో నిరంతర చర్చలు, వేగవంతమైన క్లియరెన్సులు, సమన్వయం ద్వారా తక్కువ సమయంలోనే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైందని తెలిపారు. “జాబ్స్ ఫస్ట్” లక్ష్యంతో యువతకు ఉపాధి కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. ఈ స్టీల్ ప్లాంట్‌తో పాటు 50 ఎంటీపీఏ సామర్థ్యంతో క్యాప్టివ్ పోర్టును రూ.11,192 కోట్లతో 316 ఎకరాల్లో నిర్మించనున్నారని, దీని ద్వారా సుమారు 6 వేల మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. అదేవిధంగా ప్లాంట్ నుంచి జాతీయ రహదారికి అనుసంధానంగా నాలుగు లేన్ల రహదారి నిర్మాణం చేపట్టడం ద్వారా రవాణా సదుపాయాలు మరింత మెరుగుపడతాయని అన్నారు. ఈ ప్రాజెక్ట్ రాకతో ఉత్తరాంధ్ర ప్రాంతం ఇండస్ట్రియల్ హబ్‌గా అభివృద్ధి చెందడంతో పాటు పోర్ట్ కనెక్టివిటీ, రహదారి, రైల్వే మౌలిక వసతులు బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షితులవడం ప్రభుత్వ పారదర్శక విధానాలు, వేగవంతమైన అనుమతుల ఫలితమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ పరిశ్రమ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం రాష్ట్రానికి మరింత గౌరవాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర యువత భవిష్యత్తును మార్చే ఉపాధి యంత్రంగా నిలవబోతుందని ఎమ్మెల్యే అన్నారు.



google+

linkedin

Popular Posts