కొండ బిట్రగుంటలో పడమర గాలిగోపురంకు శంకుస్థాపన
- రాబోయే బ్రహ్మోత్సవాల నాటికి గాలిగోపురాన్ని పూర్తి చేసేలా చర్యలు
- శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు
- దాతలు బచ్చు కృష్ణ కుమార్ దంపతులను అభినందించిన ఎమ్మెల్యే
బోగోలు మండలం కొండ బిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో పడమర వైపున నిర్మించనున్న గాలిగోపురం శంకుస్థాపన కార్యక్రమం బుధవారం వేదమంత్రోచరణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిలకూట క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర ఆలయం అభివృద్ధి దిశగా మరొక కీలక అడుగు పడిందన్నారు. పడమట వైపున గాలిగోపుర నిర్మాణానికి బచ్చు కృష్ణకుమార్ దంపతులు ముందుకొచ్చి దాదాపు రూ.2.5 కోట్ల వ్యయంతో ఈ మహత్తర కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఇప్పటికే ఆలయానికి ఉత్తర, తూర్పు దిశల్లో గాలిగోపుర రాజద్వారాలు ఉన్న నేపథ్యంలో, మిగిలిన దక్షిణ దిశలో కూడా గోపురం నిర్మించడం ద్వారా నాలుగు దిక్కుల నుంచి దేవుని క్షేత్రం మరింత వైభవాన్ని సంతరించుకుంటుందని తెలిపారు. అన్ని అనుకూలతలు పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు వేగవంతం చేసి రాబోయే బ్రహ్మోత్సవాల నాటికి గాలిగోపురాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా తిరుమల దేవస్థానం సహకారంతో దక్షిణ దిశలో మరొక గాలిగోపురానికి కూడా త్వరలో శంకుస్థాపన జరగనుందని తెలిపారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు దాతల సహకారంతో వేగంగా కొనసాగుతున్నాయని, ఇప్పటికే నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల సహకారంతో కోనేరు నిర్మాణం జరుగుతోందని గుర్తుచేశారు. కళ్యాణ మండపం నిర్మాణం కూడా సుమారు రూ.2 కోట్ల వ్యయంతో బచ్చు కృష్ణకుమార్ దంపతుల ఆధ్వర్యంలో కొనసాగుతుండగా, భవిష్యత్తులో అన్నదాన సత్రాలు, ప్రాకారాలు, మెట్లు వంటి మౌలిక సదుపాయాలు కూడా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అన్ని పనులు పూర్తయిన అనంతరం కుంభాభిషేకానికి ముహూర్తం ఖరారు చేయనున్నట్లు ఆలయ పాలకవర్గం నిర్ణయించిందన్నారు. ఆలయ అభివృద్ధికి విశేషంగా సహకరిస్తున్న దాతలైన బచ్చు కృష్ణకుమార్ దంపతులను ప్రత్యేకంగా అభినందిస్తూ, వారి సేవలను కావలి ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. దేవుని ఆశీస్సులతో వారి కుటుంబం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, ఆలయ ఈవో అరవ రాధాకృష్ణ, చైర్మన్ శ్రీరాం మాల్యాద్రి, దాతలు బచ్చు కృష్ణ కుమార్ దంపతులు, టీడీపీ బోగోలు మండల అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, పాలకవర్గ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.