దేవదేవుడి సన్నిధిలో అంగరంగవైభవంగా పుష్కరిణి ప్రారంభోత్సవం
- 2.5 కోట్లతో కోనేరును నిర్మించిన విపిఆర్ దంపతులు
- వేమిరెడ్డి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు.
- వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సేవకుడిగా పనిచేస్తున్నానన్న కావలి ఎమ్మెల్యే
- దాతల సహకారంతో మరెన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపిన కావలి ఎమ్మెల్యే
- పాల్గొన్న రాజ్య సభ్యులు బీద మస్తాన్ రావు, ఎమ్మెల్సీ రవిచంద్ర
దేవదేవుని ఆశీసులతో, ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్న ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి పుష్కరిణి ప్రారంభం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య, భక్తుల జయజయ ధ్వానాల మధ్య కొండ బిట్రగుంటలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీ మతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతుల చేతులమీదుగా స్వామివారి పుష్కరిణి ప్రారంభం ఘనంగా సాగింది. పురాణ కాలం నాటి వైభవాన్ని, ఆధునిక సొబగులను రంగరించుకున్న ఈ పవిత్ర పుష్కరిణి ప్రారంభోత్సవ వేడుక ఆదివారం జరగగా.. భక్తులు భారీగా తరలివచ్చారు. పుష్కరిణి ప్రారంభం అనంతరం వేమిరెడ్డి దంపతులు ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వాదాలు అందించారు.
ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామికి సేవ చేసుకునే భాగ్యం దక్కడం తన అదృష్టంగా అభివర్ణించారు. దేవాలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాదని అవి సనాతన ఆధ్యాత్మిక వారసత్వానికి నిదర్శనాలన్నారు. గత ఏడాది ఆగస్టు 10న తాను శంకుస్థాపన చేసిన కోనేరును శరవేగంగా నిర్మించి స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రారంభోత్సవం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్వామివారు తమకు ఇచ్చిన దాంట్లోనే ఇదంతా చేయగలుగుతున్నామని ఈ సందర్భంగా ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెల్లడించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎంపి బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మరియు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గార్ల కృషిని ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ సందర్భంగా ప్రశంసించారు.
అనంతరం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి కోనేరు పునఃనిర్మించే అవకాశం దక్కడం తమ పూర్వజన్మ సుకృతమన్నారు. శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో 2 కోట్ల పై చిలుకు వెచ్చించి కోనేరు పునఃనిర్మించి స్వామి వారికి కానుకగా యివ్వడం తమను వరించిన అదృష్టంగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టడం అభినందనీయం అన్నారు. కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఎంపి బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మరియు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గార్లు చేస్తున్న సేవలను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు కొనియాడారు.
ఎంపి బీదా మస్తాన్ రావు మాట్లాడుతూ ఇన్నాళ్లకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇన్నాళ్లకు బిట్రగుంట కోనేరుకు మోక్షం లభించిందన్నారు. దాదాపు రెండు కోట్ల నిధులతో కోనేరు అద్భుతంగా తయారైందని కొనియాడారు. అలాగే పలువురు దాతలు ఆలయ అభివృద్ధికి చేస్తున్న కృషిని ఆయన ప్రస్తావించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వేమిరెడ్డి దంపతుల ఆధ్యాత్మిక సేవలు మరియు వారి దాతృత్వాన్ని కొనియాడారు. రాజకీయాలోకొచ్చాక వేమిరెడ్డి దంపతులు చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలను వారు ప్రశంసించారు. నిస్వార్ధ రాజకీయాలకు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్లు చిరునామాగా మారారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి పుష్కరిణి పూర్తి చేయాలని అనేక సం.లుగా ఎంతో మంది దాతలు, శాసనసభ్యులు ఆలోచనలు చేశారు. 20 సంవత్సరాల క్రితం స్నేహితులతో కలిసి పుష్కరిణి పూర్తి చేయాలని నేను తలిచాను. కానీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆ భాగ్యం నాకు కల్పించలేదు. టిటిడి లేదా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పుష్కరిణి నిర్మాణం చేపట్టాలని కోరిన వెంటనే మరో ఆలోచన లేకుండా విపిఆర్ దంపతులు ఆమోదం తెలిపారు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి అనుమతి లేకుండా వారి ఆలయ ప్రాంగణంలో చిన్న పని కూడా చేయలేం, అందుకు మేమే ప్రత్యక్ష నిదర్శనం. ఏఎంఆర్ కంపెనీ యాజమాన్యం (ఆదినారాయణ రెడ్డి ) వారి తండ్రి సూచనతో ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులు చేపట్టాలని భావించారు. ఆశ్చర్యకరంగా ఒక్క పని కూడా పూర్తి చేయలేకపోయారు. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారితో, శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డితో ఇదే విషయం పంచుకున్నాను. చెంగాలమ్మ, రాజ రాజేశ్వరి దేవి, కామాక్షమ్మ, మూలాపేట శివాలయం వంటి దేవస్థానాలలో జరిగే కుంభాభిషేకాలకు, అభివృద్ధి పనులకు సహకరిస్తూ, నిత్యం భగవన్నామ స్మరణలో ఉండే విపిఆర్ దంపతులకు ఆరు నెలల్లో పుష్కరిణి పూర్తి చేసే అవకాశం దక్కింది. ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లాలని గతంలో మా తల్లిదండ్రులు పలుమార్లు కోరినా మేము వినిపించుకోలేదు, స్వామి వారి మొక్కుబడులను చెల్లించలేదు. కొండ బిట్రగుంట, స్వామి ఆలయం వద్ద మాకు ఊహించని ఆపద ఎదురు కావడంతో స్వామివారి మహిమ తెలుసుకున్నాం, స్వామికి భక్తులుగా మారాము. ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం మాకు పలుమార్లు దక్కింది. ఆలయ చైర్మన్ లుగా నేను, మా సోదరులు స్వామివారికి సేవలు అందించాం. ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను అందరి సహకారంతో, సమిష్టి కృషితో పూర్తి చేసేందుకు చిత్తశుద్ధిగా పనిచేస్తాం.
కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు మాట్లాడుతూ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి కోట్ల రూపాయలతో పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. నారద మహర్షి స్థాపించిన పవిత్ర క్షేత్రమైన ఈ దేవస్థానం కలియుగ దైవమైన ప్రసన్న వెంకటేశ్వర స్వామి కటాక్షంతో సముద్ర ఉప్పెనలు, కరువు కాటకాల నుంచి ఈ ప్రాంతాన్ని కాపాడుతోందని అన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం దేవాలయానికి అవసరమైన ప్రహరీ గోడ లేకపోవడంతో దేవస్థానం నిధుల నుంచి రూ.1.65 కోట్లు, తన సొంత నిధులను కలిపి ప్రహరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. దాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల సహకారంతో దాదాపు రూ.2.25 కోట్ల వ్యయంతో కోనేరు (పుష్కరిణి) నిర్మాణం చేపట్టి ఈరోజు ప్రారంభించినట్లు వెల్లడించారు. అమెరికాలో స్థిరనివాసం ఏర్పరచుకున్న బోగోలు వాసి బచ్చు కృష్ణకుమార్ 6 వేల మంది భక్తులు ఒకేసారి కూర్చుని స్వామివారి కల్యాణాన్ని వీక్షించే విధంగా రూ.2 కోట్లతో కల్యాణ మండపాన్ని నిర్మించినట్లు తెలిపారు. పడమట వైపు గాలిగోపురాన్ని రూ.2.25 కోట్లతో నిర్మించేందుకు ఈ నెల 25న శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. దక్షిణ గాలిగోపురం పనులు త్వరలో ప్రారంభమవుతాయని, దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. తూర్పు రాజద్వారం నిర్మాణం మన్నెమాల సుకుమార్ రెడ్డి చేపట్టారని తెలిపారు. కావలి యువకుడు రమేష్ రెడ్డి రూ.80 లక్షలతో తూర్పు మెట్లు నిర్మిస్తున్నారని, భక్తులు తూర్పు ద్వారం గుండా దర్శనానికి రావడం శ్రేష్ఠమని వివరించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో సిజిఎఫ్ నిధుల ద్వారా రూ.2 కోట్లతో అడ్మినిస్ట్రేషన్ భవనం, వీఐపీ కాటేజీల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. రూ.23 లక్షలతో రథశాల నిర్మాణం కూడా పూర్తయిందన్నారు. కొండను తులసి వనంగా తీర్చిదిద్దేందుకు వివిధ తులసి మొక్కలను నాటుతున్నట్లు చెప్పారు. కలెక్టర్ ద్వారా రూ.2 కోట్ల సిఎస్ఆర్ నిధులు అందనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదగా వేద పాఠశాల స్థాపనకు శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. తాను కేవలం సేవకుడిగానే పనిచేస్తున్నానని, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలతో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవస్థానం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అరవ రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, స్థానిక నాయకులు, ఆలయ సిబ్బంది, భక్తులు, తదితరులు పాల్గొన్నారు..