నూతన నవజాత శిశు సంరక్షణ విభాగం ప్రారంభం ప్రతి వైద్యశాల సరికొత్త సాంకేతికతతో అభివృద్ధి - MLA కావ్య క్రిష్ణారెడ్డి వెల్లడి

నూతన నవజాత శిశు సంరక్షణ విభాగం ప్రారంభం - ప్రతి వైద్యశాల సరికొత్త సాంకేతికతతో అభివృద్ధి - కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి వెల్లడి. 

 కావలి ఏరియా వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన నవజాత శిశు సంరక్షణ విభాగాన్ని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మరో కీలక అడుగు పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక వైద్య సదుపాయాల కల్పనలో భాగంగా ప్రతి ఆసుపత్రిని సరికొత్త సాంకేతికతతో అభివృద్ధి చేస్తున్నదని తెలిపారు. ఆ దిశగా కావలిలో నవజాత శిశువుల కోసం ప్రత్యేక సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ నూతన యూనిట్ ద్వారా పుట్టిన చిన్నారులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా, తక్షణమే అత్యాధునిక పరికరాలతో చికిత్స అందించగలమని ఆయన వివరించారు. ఇప్పటివరకు ఇలాంటి చికిత్సల కోసం ప్రైవేట్ ఆసుపత్రులు లేదా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండగా, ఇకపై అదే సేవలు స్థానికంగా అందుబాటులోకి రావడం గొప్ప పరిణామమని తెలిపారు. ఈ కేంద్రంలో ప్రత్యేకంగా ఇద్దరు వైద్యులను నియమించామని, వారు 24 గంటలు అందుబాటులో ఉండి శిశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తారని చెప్పారు. తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు లేదా ఇతర చిన్న సమస్యలు ఉన్న శిశువులు పుట్టిన మొదటి నెలలోనే ఈ కేంద్రాన్ని సంప్రదిస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్ల నవజాత శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వైద్యులు సమిష్టిగా కృషి చేసి ప్రతి శిశువు ప్రాణాలను కాపాడేందుకు అంకితభావంతో పనిచేయనున్నారని, జిల్లా స్థాయి నుంచి వైద్య సిబ్బంది ఈ యూనిట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.  కావలి నియోజకవర్గ ప్రజలు ఈ నూతన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. దూర ప్రాంతాలకు అనవసరంగా వెళ్లి ఖర్చులు పెట్టకుండా, స్థానికంగా అందుబాటులో ఉన్న ఈ ఆధునిక వైద్య సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉషా బాల, ఆర్ఎంవో ప్రమీల, వైద్య సిబ్బంది, టీడీపీ కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, హాస్పిటల్ డైరెక్టర్స్ చవల రామకృష్ణ, ఆత్మకూరు నాగలక్ష్మి, ఏటూరి శివ, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

google+

linkedin

Popular Posts