మత్స్యకార గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 27-03-2026

 మత్స్యకార గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 

మత్స్యకార కాపుల ఆహ్వానం మేరకు బోగోలు మండలంలోని మత్స్యకార గ్రామాలైన కొత్త బంగారుపాలెం, అలిచర్ల బంగారుపాలెం, పాత బంగారుపాలెం గ్రామాల్లో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు శుక్రవారం పాల్గొన్నారు. సీతాలక్ష్మణ సమేత రామ చంద్ర స్వామి ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ గ్రామాలకు విచ్చేసిన ఎమ్మెల్యే కు మత్స్యకారులు ఘన స్వాగతం పలికారు. మత్స్యకారులతో సరదాగా సంభాషించి, సరదాగా వాలి బాల్ ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీరామనవమి నాడు మీ గ్రామాలకు రావడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను అన్నారు. నా ఇంట్లో కూడా పూజలు ఉన్నప్పటికీ, ముందుగా మీ గ్రామాలకు వచ్చి శ్రీరాముని దర్శించుకోవడం నాకు ఆనందాన్ని ఇచ్చిందన్నారు. తండ్రి మాటను నిలబెట్టినవాడు, ఏకపత్నీవ్రతాన్ని ఆచరించినవాడు, అన్నదమ్ముల మధ్య ప్రేమను పెంపొందించినవాడు, ప్రజలకు సుపరిపాలన అందించినవాడు శ్రీరాముడన్నారు. అందుకే ఆయన అందరికీ ఆదర్శం అని అన్నారు. మత్స్యకార గ్రామాల ప్రజల నిజాయితీ, మాట మీద నిలబడే స్వభావం, కల్మషం లేని మనసు నాకు ఎంతో ఇష్టం అని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేగా కాకుండా మీ ఇంటి మనిషిలా మీతో కలిసిపోతున్నానని, అందుకే మీరు కూడా నాతో స్నేహపూర్వకంగా మాట్లాడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సాయంత్రం సమయంలో ప్రజలతో గడిపే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి ప్రతి గ్రామంలోకి వెళ్లి ప్రతి ఒక్కరితో ప్రత్యక్షంగా మాట్లాడతానని హామీ ఇచ్చారు. అందరికీ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బోగోలు మండల టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, మత్స్యకార కాపులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

google+

linkedin

Popular Posts