నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కమిటీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు నెల్లూరు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించడం ద్వారా జిల్లాలో టీడీపీకి మరింత శక్తి చేకూరుతుందని, ఆయన నాయకత్వంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారుతుందని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం నెల్లూరు లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన నూతన పార్లమెంట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి తో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, సీనియర్ నాయకురాలు, టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా బీద రవిచంద్ర, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కీలక అడుగులు పడుతున్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ
వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ప్రజల్లో నమ్మకాన్ని పెంచిందని అన్నారు. యువనేత నారా లోకేష్ పార్టీని భవిష్యత్తు వైపు నడిపిస్తూ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారని కొనియాడారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా నిలవడం కార్యకర్తల కృషి ఫలితమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలంతా సమన్వయంతో పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.