కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులను పరిశీలించిన కావలి ఎమ్మెల్యే
కొండ బిట్రగుంట, గురువారం-02
నెల్లూరు జిల్లా,బోగోలు మండలం కొండ బిట్రగుంటలో ఉన్న ప్రసిద్ధి గాంచిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో దేవస్థానం పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్వయంగా వెళ్లి పరిశీలించారు.ఈ సందర్భంగా దేవస్థానం పరిపాలన భవన్ నిర్మాణానికి సంబంధించి నిర్వహించనున్న భూమి పూజ స్థలాన్ని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి స్వయంగా సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
దేవస్థానం అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, పార్టీ నాయకులు మరియు గ్రామస్తులతో కలిసి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.అభివృద్ధి పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి అయ్యేలా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే సూచనలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసి, భక్తులకు అనుకూలంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు.దేవస్థానం అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రముగా మరింత పేరు పొందుతుందని ఎమ్మెల్యే గారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు,పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.