కావలి ఎంపీడివో కార్యాలయంలో NREGS పనుల మీద అధికారులతో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్న..కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు.
ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే
- పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
- కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ఆదేశం
కావలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు సంబంధించిన ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే కాలంలో ఉపాధి హామీ పథకాన్ని “విబి జి రామ్ జీ” పథకం కింద అమలు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం జరుగుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను త్వరితగతిన పూర్తిచేయాలనే దృఢ సంకల్పంతో ఈ సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఎన్ఆర్ఈజిఎస్ నిధుల ద్వారా నీటి వనరులను సంరక్షించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. చెరువులు, చెక్‌డ్యామ్‌లు, కాలువలు వంటి నీటి వనరులు సముద్రంలో కలవకుండా కాపాడే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెక్‌డ్యామ్‌లకు షోల్డర్లు ఏర్పాటు చేయడం, చెరువులకు వచ్చే సర్ప్లస్ మరియు సప్లై ఛానళ్లను ఆధునీకరించడం, చెరువు కట్టలను బలోపేతం చేయడం వంటి పనులు ప్రాధాన్యంగా చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, ప్రభుత్వ భవనాల నిర్మాణం వంటి పనులు మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా జరుగుతున్నందున, ఇందుకు అవసరమైన నిధులు అందుకోవాలంటే వేతన పనులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధి హామీ పథకం కింద ప్రతి జాబ్ కార్డ్ హోల్డర్‌కు సంవత్సరానికి 120 రోజుల పని కల్పించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ నెలలో కావలి నియోజకవర్గానికి 11,182 మంది కార్మికులకు పని కల్పించాలనే లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు కేవలం 781 మందికే పని లభించినట్లు వెల్లడించారు. మిగిలిన దాదాపు 10 వేల మందికి వచ్చే 21 రోజుల్లో ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు, నిధులను త్వరగా సమీకరించి, అన్ని పనులు నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులతో సమన్వయం కలిగి పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. ఇంకా ఒక నెల తర్వాత మళ్లీ సమీక్ష నిర్వహించి, పనుల పురోగతిని పరిశీలించి అవసరమైన సూచనలు ఇస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. “విబి జి రామ్ జీ” పథకాన్ని విజయవంతం చేసి, కావలి నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపాలనే సంకల్పంతో అధికారులు పనిచేస్తున్నారని అన్నారు. అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు. ప్రతి ఉపాధి కార్మికుడికి 120 రోజుల పని అందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ఏపిడి మృదుల, ఎంపీడీవోలు, ఏపీఓలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.






