చంద్రబాబుపై వ్యాఖ్యలకు మండిపడ్డ టీడీపీ శ్రేణులు..కావలిలో అంబటి దిష్టిబొమ్మ దహనం..
కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాలతో బీపీఎస్ సెంటర్‌లో రాస్తారోకో…అంబటి వ్యాఖ్యలకు గట్టి సమాధానం ఇచ్చిన కావలి టీడీపీ..
మాజీ మంత్రి అంబటిని రాజకీయాల నుంచి బర్త్ రఫ్ చేయాలి… కావలిలో హోరెత్తిన నిరసనలు
కావలి, ఫిబ్రవరి-01
నెల్లూరు జిల్లా,కావలి పట్టణంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశాలతో ఆదివారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.
కావలి పట్టణంలోని బీపీఎస్ సెంటర్ వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి రహదారిని కొద్దిసేపు దిగ్బంధించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలతో ప్రాంతాన్ని హోరెత్తించారు.చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడటం సమాజం ఎప్పటికీ సహించదని టీడీపీ శ్రేణులు స్పష్టం చేశాయి. రాష్ట్రాభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ దిగజారుదనానికి నిదర్శనమని విమర్శించారు.నిరసనలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ…అంబటి రాంబాబు రాజకీయాల్లో స్థాయి కోల్పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేకనే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. అంబటిని రాజకీయాల నుంచి పూర్తిగా “బర్త్ రఫ్” చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో కావలిలో టీడీపీ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి, పార్టీ గౌరవాన్ని, నాయకత్వ ప్రతిష్టను కాపాడేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ కార్యక్రమం ద్వారా స్పష్టం చేశారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ పట్టణ, మండల నాయకులు, యువ నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.