సమాజ మార్పుకు బలమైన పునాది వేసిన వ్యక్తి పూలే 11-04-2026
- ఘనంగా మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలు
- నివాళులు అర్పించిన కూటమి నేతలు
మహిళా విద్యకు ప్రాధాన్యం ఇచ్చి సమాజ మార్పుకు బలమైన పునాది వేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావ్ పూలే అని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు, కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని మహాత్మా జ్యోతిరావ్ పూలే విగ్రహం వద్ద జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మహాత్మా జ్యోతిరావ్ పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావ్ పూలే ఒక గొప్ప సంఘ సంస్కర్తగా నిలిచారని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న అసమానతలు, కుల వివక్షను నిర్మూలించేందుకు విద్యనే ప్రధాన ఆయుధంగా భావించి ఆయన చేసిన కృషి అపారమని తెలిపారు. అలాగే, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గారి సహకారం కూడా అపారమని, ఇద్దరూ కలిసి మహిళల విద్యాభివృద్ధికి మార్గదర్శకులయ్యారని కొనియాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల సామాజిక, రాజకీయ చైతన్యానికి పూలే గారి ఆలోచనలు ఎంతో ప్రేరణగా నిలిచాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు గారు కూడా పూలే ఆశయాలను కొనసాగిస్తూ బడుగు వర్గాల అభివృద్ధి కోసం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ ప్రధాన అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, బాలగురుస్వామి, టీడీపీ బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు గుండ్లపల్లి శివాజీ, పోట్లూరి శ్రీనివాసులు, జనసేన పట్టణ అధ్యక్షులు పొబ్బా సాయి విఠల్, ఇతర పార్టీ నాయకులు, బీసీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.