మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమే 13-04-2026

 మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమే 13-04-2026

మత్స్యకారుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక. 15వ తేదీన మత్స్యకారుల ఖాతాల్లో రూ.20 వేలు జమ. వైసీపీ ఉనికి కోసమే జగన్ జువ్వలదిన్నె పర్యటన. వైసీపీ నేతలు మత్స్యకారులలో అపోహలు, అయోమయం సృష్టిస్తున్నారు. ప్రధానమంత్రి మత్స్యకార యోజన కింద రూ.1.20 కోట్ల విలువైన ఆధునిక బోట్లను అందజేస్తున్నాము . జువ్వలదిన్నె ఆధునిక ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల భవిష్యత్తును మారుస్తుంది. సాగర్ డిఫెన్స్ ద్వారా మత్స్యకారులకు సాంకేతిక సేవలు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని మత్స్యకారులు అభివృద్ధి దిశగా ముందుకు సాగాలి. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి.

మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, అందుకే మత్స్యకారులు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతుందని అన్నారు. బీజేపీ–జనసేన–తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో స్థిరమైన మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. మత్స్యకార భరోసా పథకాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పెంచినట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 15వ తేదీన అర్హులైన మత్స్యకారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం అధిక శాతం లబ్ధిదారులకు ఈ పథకం అందుతున్నదని చెప్పారు.

అభివృద్ధి కార్యక్రమాలపై అపోహలు సృష్టిస్తూ మత్స్యకారులలో అయోమయం కలిగించే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తున్నారని ఆరోపించారు. గత ఐదు సంవత్సరాల్లో మత్స్యకారుల సంక్షేమానికి వైసీపీ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. మత్స్యకారుల పై ప్రేమతో కాకుండా, కేవలం వైసీపీ తమ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం జగన్ ను జువ్వలదిన్నె కు తీసుకొని వస్తున్నారని విమర్శించారు. జగన్ కార్యక్రమానికి మత్స్యకారులు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో, బయటి నేతలను, కార్యకర్తలను తీసుకొని వచ్చే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి జిమ్మిక్కుల వలన ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారని అన్నారు. మత్స్యకారుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు మానుకోవాలని, వైసీపీ నాయకులు ఇప్పటికైనా వాస్తవాలు మత్స్యకారులకు తెలియజేయాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, యువనేత నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనలతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుతో మత్స్యకార రంగానికి ప్రాధాన్యం పెరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మత్స్యకారులకు వలలు, పడవలు, ఇంజన్లు కొనుగోలు కోసం 60 శాతం వరకు సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు.

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 80 శాతం వరకు ఆర్థిక సహాయం లభిస్తున్నదని చెప్పారు. ప్రధానమంత్రి మత్స్యకార యోజన కింద రూ.1.20 కోట్ల విలువైన ఆధునిక పడవలను అందజేస్తున్నట్లు వెల్లడించారు. కావలి నియోజకవర్గంలో ఇటీవల 170 మంది మత్స్యకారులకు మోటార్లపై 40 శాతం సబ్సిడీ ఇచ్చినట్లు వివరించారు. జువ్వలదిన్నెలో 115 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న ఆధునిక ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల భవిష్యత్తును మారుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.158 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. హార్బర్‌లో ఆధునిక జెట్టీలు, లోడింగ్–అన్‌లోడింగ్ సదుపాయాలు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, ఫిష్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. దీని ద్వారా మత్స్యకారులకు సరైన ధరలు లభించి, దళారులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా హార్బర్ పరిధిలో సాగర్ డిఫెన్స్ సంస్థకు 29 ఎకరాల భూమి కేటాయించడం ద్వారా సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు.

సముద్రంలో వాతావరణ హెచ్చరికలు, సైక్లోన్ సమాచారం, చేపల నిల్వ ప్రాంతాలపై శాటిలైట్ వివరాలు, తప్పిపోయిన పడవల గుర్తింపు వంటి సేవలు అందించబడతాయని చెప్పారు. దీని ద్వారా మత్స్యకారుల భద్రత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడం, వారి ఆదాయాన్ని పెంచడం, సాంకేతికతతో భద్రతను పెంపొందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని మత్స్యకారులు అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, బోగోలు మండల టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, కోడూరు వెంకటేశ్వర్లు రెడ్డి, రేబాల శంకర రెడ్డి, మేడా క్రిష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

google+

linkedin

Popular Posts