గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తున్నాము - కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి వెల్లడి
- మహిళలకు మగ్గం వర్క్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే
గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు బలమైన పునాది వేయాలనే లక్ష్యంతో ఎంబ్రాయిడింగ్, అల్లికలు, పెయింటింగ్ వంటి చేతివృత్తులపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం కావలి పట్టణంలోని వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళల మగ్గం వర్క్ ట్రైనింగ్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ హ్యాండ్‌మేడ్ ఉత్పత్తులకు ఈ రోజుల్లో మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందన్నారు. యంత్రాలతో తయారైన వస్తువులతో పోలిస్తే చేతితో చేసిన ప్రతి వస్తువుకూ ప్రత్యేకత, నాణ్యత, భావోద్వేగ విలువ ఉంటుందని చెప్పారు. మన చేతితో వండిన ఆహారం ఎంత రుచిగా ఉంటుందో, అలాగే చేతితో చేసిన వస్తువులకు కూడా అంతే విలువ ఉంటుందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేక కారణాల వల్ల చదువు కొనసాగించలేకపోయిన మహిళలు కూడా జీవితంలో వెనుకబడిపోకుండా, ఈ శిక్షణల ద్వారా కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. వివాహం తర్వాత కూడా మహిళలు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్వయం సహాయక సంఘాల ద్వారా అమలవుతున్న పొదుపు ఉద్యమం మహిళలకు ఆర్థిక బలం ఇచ్చిందని, 1999లో నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘాల ద్వారా మహిళలు కేవలం పొదుపు మాత్రమే కాకుండా, వ్యాపార దిశగా కూడా అడుగులు వేస్తున్నారని తెలిపారు. శిక్షణ కోసం దూర ప్రాంతమైన కరీంనగర్ నుంచి నిపుణులను తీసుకువచ్చి మహిళలకు ప్రత్యక్షంగా శిక్షణ ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. మండల స్థాయి అధికారులు, ఏపీఎంలు, సిబ్బంది, సంఘ నాయకుల సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని చెప్పారు. ఆకర్షణీయంగా ఉంచిన వస్తువులు వినియోగదారులను వెంటనే ఆకట్టుకుంటాయని, నేటి వినియోగ సంస్కృతిలో అన్ ప్లాన్డ్ కొనుగోళ్లు పెరుగుతున్నాయని తెలిపారు. మాల్స్, షాపింగ్ సెంటర్లలో డిస్ప్లే కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. పెద్ద నగరాల్లో బోటిక్‌ల పేరుతో చేతితో తయారైన బ్లౌజులు, డిజైన్లు రూ.10,000 నుంచి రూ.50,000 వరకు అమ్ముడవుతున్నాయని అన్నారు. గ్రామీణ మహిళలు కూడా చిన్న యూనిట్లు ఏర్పాటు చేసి, కలసికట్టుగా పనిచేస్తే మంచి ఆదాయం పొందవచ్చని సూచించారు. నేర్చుకున్న కళలను ఇతరులకు పంచి, మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం కృష్ణారావు, సిసి రసూల్, ట్రైనర్, ట్రైనింగ్ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు..
