గ్రామ అభివృద్ధికి కమిటీలు కీలకం
- కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి వెల్లడి
- చంద్రబాబు నగర్ మత్స్యకార కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
గ్రామ అభివృద్ధి, సంప్రదాయాల పరిరక్షణకు గ్రామ స్థాయిలో ఏర్పడిన కమిటీలు ఎంతో ముఖ్యమని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం అల్లూరు మండలం ఇస్కపల్లి పంచాయతీ లోని చంద్రబాబు నగర్ లో మత్స్యకారులు నియమించుకున్న నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మత్స్యకారులను సత్కరించి, అభినందనలు తెలిపారు. ముందుగా స్థానిక ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ ప్రజలంతా కలిసి పెద్ద కాపు, రెండవ కాపు, మూడవ కాపు వంటి బాధ్యతలను పంచుకొని, ఒకరిని మంత్రి, మరొకరిని క్యాషియర్‌గా నియమించుకొని కమిటీని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. గ్రామంలోని ఆచారాలు, సంప్రదాయాలు, ఉత్సవాలను సమన్వయంతో నిర్వహించేందుకు ఈ కమిటీలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే అన్నారు. గ్రామ ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు తాను, తన బృందం సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. కాలనీలు, పెన్షన్లు వంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
రాజకీయంగా, సామాజికంగా ప్రజలకు అవసరమైన ప్రతి అంశంలో న్యాయం జరిగేలా చూస్తామని, గ్రామాభివృద్ధికి తాము తోడుగా ఉంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కమిటీ సభ్యులు గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన గ్రామస్తులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీద గిరిధర్, పలగాటి శ్రీనివాసులు రెడ్డి, ఊటు శ్రీకాంత్ రెడ్డి, హరికృష్ణ, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మత్స్యకారులు, తదితరులు పాల్గొన్నారు.