కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి పనులను పరిశీలించిన..ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..
బోగోలు (మండలం)కొండ బిట్రగుంట,శనివారం:30
నెల్లూరు జిల్లా,బోగోలు మండలం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి శనివారం పరిశీలించారు. ఆలయ అధికారులు,కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలతో కలిసి దేవస్థానాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, ప్రస్తుతం చేపడుతున్న నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా దేవస్థానం ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న తూర్పు గాలిగోపురం, పడమర గాలిగోపురం, భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న మెట్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పనుల నాణ్యత, నిర్మాణ వేగం, భక్తులకు అందుబాటులో ఉండే సౌకర్యాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, అధికారులతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో దేవస్థానం అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, విశ్రాంతి వసతులు, రహదారి సౌకర్యాలు, పార్కింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాకుండా ఈ ప్రాంతానికి గుర్తింపుగా నిలుస్తోందని ఎమ్మెల్యే అన్నారు. భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, అవసరమైన నిధుల కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి చెందడం వల్ల జిల్లాలోని భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు కూడా మరింత సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాధాకృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్, శ్రీరామ్ మాలాద్రి కమిటీ సభ్యులు,ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.