కావలి రోటరీ క్లబ్‌లో సభ్యత్వం పొందిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

కావలి రోటరీ క్లబ్‌లో సభ్యత్వం పొందిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

రోటరీ క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శం – ఎమ్మెల్యే

కావలి, జూలై 28:

కావలి పట్టణ అభివృద్ధితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు తనవంతు సహకారం అందించాలనే సంకల్పంతో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి రోటరీ క్లబ్ ఆఫ్ కావలిలో సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రతినిధులు ఎమ్మెల్యేను అభినందించి సభ్యత్వ ధ్రువపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, రోటరీ క్లబ్ అనేక సంవత్సరాలుగా విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, రక్తదాన శిబిరాలు, పేద విద్యార్థులకు సహాయం, ఆరోగ్య శిబిరాలు, తాగునీటి సదుపాయాల కల్పన వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి విశేష సేవలు అందిస్తోందని కొనియాడారు.సేవాభావంతో ముందుకు సాగుతున్న రోటరీ క్లబ్ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్న ఎమ్మెల్యే, సమాజ అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల పాత్ర కూడా ఎంతో కీలకమని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం చేపట్టే ప్రతి మంచి కార్యక్రమానికి తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.కావలి అభివృద్ధితో పాటు విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమ రంగాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను సంయుక్తంగా నిర్వహించేందుకు రోటరీ క్లబ్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు.రోటరీ క్లబ్ అధ్యక్షులు, సభ్యులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సభ్యత్వం స్వీకరించడం కావలి రోటరీ క్లబ్‌కు మరింత గౌరవాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు.ప్రజా సేవలో కలిసి పనిచేస్తూ కావలి అభివృద్ధికి తమవంతు కృషి కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శి, క్లబ్ సభ్యులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.





google+

linkedin

Popular Posts