శ్రీ సాయి క్షేత్రంలో గురుపౌర్ణమి మహోత్సవ వేడుకలు..
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు.
కావలి,జులై:29
కావలి ముసునూరు శ్రీ సాయి క్షేత్రంలో నిర్వహిస్తున్న గురుపౌర్ణమి మహోత్సవ వేడుకలు రెండు రోజుల నుంచి భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఆలయాన్ని సందర్శించి శ్రీ సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల వేదమంత్రోచ్చారణల నడుమ ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు.ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి క్షేత్ర అభివృద్ధి కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి ఆత్మీయంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, సాయిబాబా వారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, శ్రీ సాయిబాబా చూపిన సేవా మార్గం, సత్యం, ధర్మం, మానవతా విలువలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. గురుపౌర్ణమి పర్వదినం గురువుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసే పవిత్రమైన రోజు అని, భక్తులందరూ ఆధ్యాత్మిక చింతనతో జీవనాన్ని సార్థకం చేసుకోవాలని ఆకాంక్షించారు. ముసునూరు శ్రీ సాయి క్షేత్రంలో ప్రతి సంవత్సరం గురుపౌర్ణమి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనందదాయకమని ఎమ్మెల్యే అన్నారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, తనవంతు సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.మహోత్సవాల్లో భాగంగా కాకడ హారతి, అభిషేకాలు, సహస్రనామార్చన, అన్నదాన కార్యక్రమం, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మహామంగళహారతి వంటి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ వేడుకలకు కావలి పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి సాయిబాబా వారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు.
కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా భక్తులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.