కావలి కాలువ అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆగ్రహం..
గండిపడ్డ కాలువ వద్దకు చేరుకుని స్వయంగా పర్యవేక్షణ..యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు ప్రారంభం..
కావలి, జూలై 28:
నెల్లూరు జిల్లా, సోమశిల జలాశయం నుంచి కావలి, దగదర్తి, జలదంకి ప్రాంతాలతో పాటు కావలి పట్టణానికి తాగునీరు, సాగునీరు అందిస్తున్న కీలకమైన కావలి కాలువకు సంగం మండలం మర్రిపాడు సమీపంలో గండి పడిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మూడు రోజులుగా భారీగా నీరు వృథాగా పోతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సుమారు 67.619 కిలోమీటర్ల పొడవు కలిగిన కావలి కాలువ ద్వారా దాదాపు 1.2 లక్షల మందికి తాగునీరు, సాగునీరు అందుతోంది. ఈ కాలువ పరిధిలోని లక్ష ఎకరాలకుపైగా ఆయకట్టు రైతులు ఈ నీటిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి కీలకమైన కాలువలో ఏర్పడిన గండి కారణంగా నీరు వృథాగా పోవడం, రైతులకు సాగునీటి సమస్యలు తలెత్తే పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.ఎగువ ప్రాంతం నుంచి 650 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో మర్రిపాడు వద్ద ఉన్న పాత బ్రిడ్జి స్లాబ్ కింద భాగంలో ఎయిర్ క్రాక్స్ ఏర్పడి నీరు బయటకు లీకవుతోందని అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. పాత బ్రిడ్జి కావడం, దిగువకు నీరు వెళ్లేందుకు తగిన మార్గం లేకపోవడంతో ఒత్తిడి పెరిగి ఈ పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం అందిందన్నారు.అయితే మూడు రోజులుగా నీరు వృథాగా పోతున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని ఎమ్మెల్యే మండిపడ్డారు. స్థానిక ప్రజలు సమాచారం ఇవ్వడంతో తానే స్వయంగా వచ్చి పరిశీలించాల్సి రావడం విచారకరమన్నారు. ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలిగే అంశాలపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిందిపోయి పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.
సంఘటనా స్థలంలోనే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. వెంటనే కాంక్రీట్ మిక్సర్ యంత్రాలను రప్పించి తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. పనులను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తూ అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో కాలువ మరమ్మతు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో ఫోన్‌లో మాట్లాడి అధికారుల నిర్లక్ష్యాన్ని వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యవసర చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు. సమస్య తీవ్రతను గుర్తించిన కలెక్టర్ కూడా వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులనుఆదేశించినట్లు తెలిపారు.
ఇదే సందర్భంగా కావలి కాలువ 12వ కిలోమీటర్ వద్ద ఉన్న సైఫన్ దెబ్బతిని దాదాపు 25 రోజులుగా నీరు సముద్రంలో కలిసిపోతున్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్‌కు, ప్రజాప్రతినిధులకు లేదా తమ దృష్టికి తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.సైఫన్ దెబ్బతిన్న విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సైఫన్ మరమ్మతుల కోసం ₹27 లక్షల నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రస్తుతం ఆ నిధులతో అత్యవసర మరమ్మతు పనులు చేపట్టేందుకు చర్యలు జరుగుతున్నాయని తెలిపారు.
కాలువ దెబ్బతినడంతో సుమారు లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సరఫరా అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే స్థానిక రైతుల సహకారంతో పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా రైతులకు ఎమ్మెల్యే ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని ఒక రైతు ఎక్కువగా నిల్వ చేసుకోకుండా అందరూ పరస్పర సహకారంతో, ఆరుతడుల పద్ధతిలో వినియోగించుకోవాలని కోరారు. రైతులు సమన్వయంతో వ్యవహరిస్తే అందరికీ సాగునీరు అందుతుందని తెలిపారు.
రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో మరమ్మతు పనులను పూర్తిచేసి కావలి కాలువ ద్వారా రైతాంగానికి, తాగునీటి అవసరాలకు ఎలాంటి అంతరాయం లేకుండా మళ్లీ నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు.ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలిగించే అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, కాలువల సంరక్షణలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు.