ఆగస్టు 15న కావలి ప్రజలకు అంకితం కానున్న మందాటి చెరువు మినీ ట్యాంక్ బండ్..
వాకింగ్ ట్రాక్, లైటింగ్, తెలుగు తల్లి విగ్రహం, ఓపెన్ జిమ్, చిన్నారుల ఆట స్థలాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
కావలి, జూలై 29:
కావలి పట్టణ ప్రజలకు మరింత మెరుగైన వినోద, ఆరోగ్య, విశ్రాంతి వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో మందాటి చెరువు పరిసర ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని సంబంధిత అధికారులు,పార్టీ నాయకులు ఇంజినీర్లతో కలిసి పరిశీలిస్తూ, ప్రతి పనిని నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.మందాటి చెరువు ప్రాంతాన్ని ఆధునిక సౌకర్యాలతో కూడిన ప్రజా వినోద కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రజలు ఉదయం, సాయంత్రం ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవాటు చేసుకునేలా అత్యాధునిక వాకింగ్ ట్రాక్, రాత్రి వేళల్లో సైతం ప్రజలు సురక్షితంగా సంచరించేందుకు అధునాతన లైటింగ్, తెలుగు భాషా, సంస్కృతికి ప్రతీకగా తెలుగు తల్లి విగ్రహం, వృద్ధులు మరియు యువత వ్యాయామం చేసుకునేందుకు ఓపెన్ జిమ్, చిన్నారులు ఆడుకునేందుకు వివిధ రకాల గేమ్స్ మరియు ప్లే ఏరియాలను ఏర్పాటు చేస్తున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, కావలి పట్టణ ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో సమయం గడిపేలా మందాటి చెరువు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
పనుల్లో ఎలాంటి నాణ్యత లోపాలు ఉండకూడదని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే, ప్రతి అంశాన్ని స్వయంగా పరిశీలిస్తూ అవసరమైన సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని సూచించారు.రానున్న ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అభివృద్ధి పనులను కావలి నియోజకవర్గ ప్రజలకు అంకితం చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ ప్రదేశం పూర్తయిన తర్వాత పట్టణ ప్రజలకు ఒక అందమైన విహార కేంద్రంగా, ఆరోగ్యకరమైన వాకింగ్ స్పాట్‌గా, పిల్లలు, మహిళలు, వృద్ధులు అందరూ ఉపయోగించుకునే సమగ్ర పార్క్‌గా మారుతుందని ఆమె తెలిపారు.ఈ అభివృద్ధి పనులు పూర్తయితే కావలి పట్టణానికి మరో ప్రత్యేక ఆకర్షణగా మందాటి చెరువు మినీ ట్యాంక్ గా నిలుస్తుందని, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును రూపుదిద్దుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ఇంజినీర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు..