విద్యార్థులు పునాది నుంచే సత్ప్రవర్తనతో మెలగాలి – కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి..
- ఒట్టూరులో ఘనంగా 'మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ 4.O' కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే
- ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు
- మంత్రి నారా లోకేష్ ఆలోచనతో విద్యా వ్యవస్థలో చారిత్రాత్మక సంస్కరణలు –
- ఉత్తమ విద్యార్థులు ప్రైజ్ మనీ అందజేసిన ఎమ్మెల్యే..
- తల్లిదండ్రులు, గ్రామస్తుల భాగస్వామ్యంతోనే పాఠశాలల అభివృద్ధికి సాధ్యం ఎమ్మెల్యే..
కావలి, జూలై 24:
విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, సత్ప్రవర్తన, మంచి విలువలు అలవరచుకొని సమాజానికి ఆదర్శ పౌరులుగా ఎదగాలని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ 4.0' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కావలి రూరల్ మండలం,అన్నగారిపాలెం పంచాయతీ పరిధిలోని ఒట్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ఒట్టూరు మోడల్ స్కూల్లో నిర్వహించిన సమావేశాలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఎమ్మెల్యే రాక సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థినులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.విద్యార్థులు పుష్పగుచ్ఛాలు అందజేశారు.అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, విలువల ఆధారిత నృత్య ప్రదర్శనలు సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు, విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి విద్యా అభివృద్ధిపై చర్చించే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దూరదృష్టికి నిదర్శనమని అన్నారు.విద్యార్థుల భవిష్యత్తును మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం విద్యా రంగంలో అనేక వినూత్న సంస్కరణలు అమలు చేస్తోందని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, నాణ్యమైన ఫర్నిచర్, తాగునీటి వసతి, పారిశుద్ధ్య సౌకర్యాలు, మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.పిల్లల అభ్యాసంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే తెలిపారు. పాఠశాలకు పంపించడం మాత్రమే కాకుండా పిల్లల చదువుపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని,ఉపాధ్యాయులతో తరచూ సంప్రదింపులు జరపాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు కలిసి పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయని చెప్పారు.విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా మంచి నడవడి, క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక బాధ్యత,పర్యావరణ పరిరక్షణ, పెద్దల పట్ల గౌరవం,సేవాభావం వంటి విలువలను జీవితంలో అలవర్చుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఉపాధ్యాయులు అందించే మార్గదర్శకత్వాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు."కష్టపడి చదివితే సాధించలేనిది ఏదీ లేదు. ప్రతి విద్యార్థి తన తల్లిదండ్రులకు, తన గ్రామానికి, తన పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలి. విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా సమానంగా అవసరం. మంచి విద్యార్థులే రేపటి మంచి పౌరులు, మంచి నాయకులు అవుతారు" అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థకు నూతన దిశ లభిస్తోందని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చారిత్రాత్మకమని కొనియాడారు.విద్యా రంగంలో తీసుకొస్తున్న సంస్కరణల వల్ల ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతోందన్నారు.అనంతరం పాఠశాలల్లోని తరగతి గదులు, మౌలిక వసతులు, విద్యార్థుల అభ్యాస పరిస్థితులను ఎమ్మెల్యే పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు శాతం, పాఠశాల అవసరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.పాఠశాలల అభివృద్ధికి అవసరమైన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు,ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.