బోగోలు మండలం పాత బిట్రగుంటలో శ్రీ షిరిడి శేష సాయిబాబా దేవస్థానంలో 30వ గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న నిర్వహించిన ఎమ్మెల్యే.
దేవస్థానం వ్యవస్థాపకులు కుట్టుబోయిన బ్రహ్మానందం, ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం.
బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డితో కలిసి జిల్లాస్థాయి బండలాగుడు పోటీలను ప్రారంభించిన..ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.
శేష సాయిబాబా దేవస్థానం అభివృద్ధి, గ్రామీణ సంస్కృతి, బండలాగుడు పోటీల విశిష్టత, పశుసంపద ప్రాధాన్యతను వివరించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.
బోగోలు, జూలై 29:
బోగోలు మండలం పాత బిట్రగుంటలోని శ్రీ షిరిడి శేష సాయిబాబా దేవస్థానంలో నిర్వహించిన 30వ గురు పౌర్ణమి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందారు.ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు శ్రీ షిరిడి శేష సాయిబాబా దేవస్థానం వ్యవస్థాపకులు కుట్టుబోయిన బ్రహ్మానందం, ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఘన స్వాగతం పలికారు.పూర్ణకుంభ స్వాగతం, వేదమంత్రాల నడుమ ఆలయ సంప్రదాయాల ప్రకారం ఎమ్మెల్యేను ఆహ్వానించి సత్కరించారు.అనంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సాయిబాబా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అర్చనలు, హారతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు, కావలి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రైతాంగం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని సాయిబాబాను ప్రార్థించారు.
గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి బండలాగుడు పోటీలను బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. పోటీల్లో పాల్గొన్న రైతులు, ఎద్దుల యజమానులకు అభినందనలు తెలియజేస్తూ పోటీలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, శ్రీ షిరిడి శేష సాయిబాబా దేవస్థానం ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి వేడుకలను వేలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి కోసం వ్యవస్థాపకులు కుట్టుబోయిన బ్రహ్మానందం ఎన్నో సంవత్సరాలుగా విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు.అలాగే గురు పౌర్ణమి భారతీయ సంస్కృతిలో గురువుల పట్ల కృతజ్ఞతను చాటే పవిత్రమైన పర్వదినమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గురువు చూపే మార్గమే జీవితానికి దిశానిర్దేశం చేస్తుందని, గురువులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.జిల్లాస్థాయిలో నిర్వహిస్తున్న బండలాగుడు పోటీలు గ్రామీణ సంస్కృతి, రైతాంగ జీవన విధానానికి అద్దం పట్టే సంప్రదాయ క్రీడలని ఎమ్మెల్యే వివరించారు. ఇలాంటి పోటీలు యువతకు మన సంప్రదాయాలను పరిచయం చేయడమే కాకుండా గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం అందిస్తాయని అన్నారు. రైతు జీవితంలో ఎద్దులకు ఉన్న ప్రాధాన్యతను భావితరాలకు తెలియజేసే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తోందని పేర్కొన్నారు.
పశుసంపదే రైతుకు నిజమైన సంపద అని ఎమ్మెల్యే అన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధిలో ఎద్దులు, ఆవులు వంటి పశువులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పశువులను ప్రేమతో సంరక్షించడం, వాటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ప్రతి రైతు బాధ్యత అని అన్నారు. పశువుల పరిరక్షణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని వివరించారు.
ఆధ్యాత్మికత, సంప్రదాయం, గ్రామీణ సంస్కృతి ఒకే వేదికపై ప్రతిబింబించేలా గురు పౌర్ణమి వేడుకలు, జిల్లాస్థాయి బండలాగుడు పోటీలు విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో శేషసాయి మందిరం దేవస్థానం వ్యవస్థాపకులు కుట్టుబోయిన బ్రహ్మానందం,బోగోల మండల టిడిపి అధ్యక్షులు మాలపాటి నాగేశ్వరరావు,నాగులవరం సింగల్ విండో అధ్యక్షులు చిలకపాటి వెంకటేశ్వర్లు, కోడూరు వెంకటేశ్వర్ రెడ్డి, రావి విజయ్ యాదవ్, బసిరెడ్డి, ఐటీడీపి అధ్యక్షుడు కంచర్ల చక్రి, గోచిపాతల సంజయ్, సయ్యద్ సుభాని,ఆలయ అర్చకులు, దేవస్థాన కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రైతులు, బండలాగుడు పోటీల్లో పాల్గొన్న పోటీదారులు, భక్తులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.