స్థానిక సంస్థల ఎన్నికల్లో కావలి గడ్డపై టిడిపి జెండా ఎగరవేద్దాం
- పదవులు ఉన్నా లేకున్నా ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తా
- అధికారం లేకపోయినా వైసీపీతో యుద్ధం చేసిన వారినే కొనసాగిస్తున్నాను
- జీవితంలో కొంత శ్రమను త్యాగం చేస్తేనే ఫలితం ఉంటుంది
- కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలను మెచ్చి, మీ కష్టాన్ని చూసి మీకు పదవులు ఇచ్చానని, ప్రతి కార్యకర్త పదవులు ఉన్నా లేకున్నా మన పార్టీ కోసం శ్రమించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కావలి గడ్డపై టిడిపి జెండాను ఎగరవేద్దామని ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు. శనివారం కావలి టిడిపి కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమావేశం, కమిటీల ఎంపిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పార్టీ అబ్జర్వర్ల సమక్షంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణ, మండల అధ్యక్షులను, కార్యదర్శులను నియమించారు. ప్రతి కార్యకర్త ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజలకు అందజేసి పార్టీ బలోపేతానికి సమన్వయంతో పని చేస్తారని పదవులు ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.
పదవులు ఉన్నా లేకున్నా కూడా అందరికీ సముచిత స్థానాన్ని కల్పిస్తానని అన్నారు. మనందరం కలిసి మన పార్టీ బలోపేతానికి కృషి చేసి స్థానిక సంస్థ ఎన్నికల్లో విజయం సాధించేందుకు నేటి నుంచే కస్టపడి పని చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయసులో కూడా మన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఎంతో శ్రమను దానం చేస్తున్నారన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి కోసం మన జీవితంలో మనం కూడా కొంత సమయం, శ్రమను దానం చేయలేమా అని అన్నారు. ఎన్నికల్లో మీరు చేసిన శ్రమ వల్లే ఎవరికి రాని మెజారిటీ నాకు వచ్చిందన్నారు. ఇంతటి మెజార్టీతో నన్ను గెలిపించిన ప్రతి కార్యకర్తకు రుణపడి ఉన్నానన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుండి కావలిలోనే ఉంటూ ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో పనిచేస్తూ నావంతు కృషి చేస్తున్నానన్నారు. నాపై ఎన్ని విమర్శలు చేసిన నా కావలి ప్రజల కోసం, కావలి అభివృద్ధి కోసం ఇంకా రెట్టింపు ఉత్సాహం తో పని చేస్తున్నానన్నారు.
పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త గుర్తున్నారని, ప్రతి ఒక్కరినీ కూడా కాపు కాసుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు... నూతన మండల కమిటీలను ఈ సందర్భంగా అబ్జ్ర్వర్లు ప్రకటించారు. కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, కావలి రూరల్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు, అల్లూరు మండల అధ్యక్షులు బండి శ్రీనివాసులు రెడ్డి, అల్లూరు మండల ప్రధాన కార్యదర్శి అంబటి రాజేంద్ర, అల్లూరు పట్టణ అధ్యక్షులు రామిశెట్టి కృష్ణ చైతన్య, అల్లూరు పట్టణ ప్రధాన కార్యదర్శి అరగల రమణయ్య, బోగోలు మండల అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, బోగోలు మండల ప్రధాన కార్యదర్శి లేళ్లపల్లి సుధీర్ బాబు, దగదర్తి మండల అధ్యక్షులు అల్లం హనుమంతరావు, దగదర్తి మండల ప్రధాన కార్యదర్శి వింజం కొండపనాయుడు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన వారిని ఎమ్మెల్యే సత్కరించారు.. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, చక్కా మదన్ కుమార్, పొన్నెబోయిన చెంచు కిషోర్, భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..