విద్యార్థి దశలోనే నాయకత్వం, క్రమశిక్షణ అలవరచుకోవాలి
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విద్యార్థి సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయి. చదువుతో పాటు నిజ జీవిత పాఠాలు నేర్చుకోవాలి. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
విద్యార్థి దశలోనే నాయకత్వం, క్రమశిక్షణ అలవరచుకోవాలని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. కావలి పట్టణం శాంతినగర్‌లోని శ్రీ చైతన్య పాఠశాల (మాస్టర్ స్కూల్ క్యాంపస్)లో శనివారం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నెల్లూరు విభాగ్ ఆధ్వర్యంలో అభ్యాస వర్గ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు, పోరాట తత్వం, క్రమశిక్షణ అలవర్చుకోవడం అత్యంత అవసరమని సూచించారు. విద్యార్థి సంఘాలు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. నేను కూడా 1987లో కావలి జేబీ కాలేజీలో చదువుతున్నప్పుడు విద్యార్థి సంఘాల్లో చురుకుగా పనిచేశానని, అదే అనుభవం నన్ను నేటి స్థాయికి తీసుకువచ్చిందన్నారు. ఏబీవీపీ అంటే క్రమశిక్షణకు మరో పేరన్నారు.
ఈ సంస్థ విద్యార్థుల్లో క్రమశిక్షణతో పాటు సమాజ సమస్యలపై అవగాహన కలిగేలా చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువులో ఎప్పుడూ రాజీ పడకూడదని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. పాఠ్య పుస్తకాల పాఠాలతో పాటు నిజ జీవిత పాఠాలను నేర్చుకోవాలని, అలా చేస్తేనే సమాజంలో మార్పు తేవచ్చన్నారు. ఏబీవీపీ వంటి సంస్థలు దేశభక్తి, సేవాభావం, సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి వేదికలుగా నిలుస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య, ఏబీవీపీ నాయకులు భరత్, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.