దగదర్తి ఎయిర్‌పోర్ట్ పనులు త్వరలో ప్రారంభం - స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు
దగదర్తి విమానాశ్రయ ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. శనివారం ఆయన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి దగదర్తి ఎయిర్‌పోర్ట్ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ దగదర్తిలో సుమారు 1,370 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే శంకుస్థాపన జరిగిందని, ఇటీవల ఆర్ఎఫ్పి ప్రక్రియను ప్రారంభించినట్లు వివరించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ మోడల్‌లో భోగాపురం విమానాశ్రయంలా ఇక్కడ కూడా ప్రైవేట్ ఆపరేటర్లతో భాగస్వామ్యం కల్పించనున్నామని చెప్పారు. నవంబర్ లోగా దరఖాస్తులు ముగియనున్నాయని, డిసెంబర్ నాటికి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. దగదర్తి ప్రాంతం పరిశ్రమల అభివృద్ధికి అనువైన స్థలమని, కృష్ణపట్నం, రామయ్యపట్నం, దుగ్గరాజపట్నం వంటి పోర్ట్‌లకు సమీపంలో ఉండటం వల్ల విమానాశ్రయానికి మంచి వాణిజ్య అవకాశాలు ఉన్నాయని కృష్ణబాబు గుర్తించారు.
భవిష్యత్తులో ఇక్కడ మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, బిపిసిఎల్ వంటి పరిశ్రమలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కావున ఈ విమానాశ్రయం ఆర్థికపరంగా వయబుల్‌గా మారుతుందని నమ్ముతున్నట్లు ఆయన వెల్లడించారు. అన్ని పనులు సజావుగా జరిగితే 2026లో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుందని అన్నారు. రెండు సంవత్సరాల్లో విమానాశ్రయం పూర్తవుతుందని ఆశిస్తున్నామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణ దాదాపు పూర్తయిందని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి దూరదృష్టిని ప్రశంసిస్తూ సాధారణంగా ఐఏఎస్ అధికారులు చేసే స్థాయి పరిశోధన, డేటా సేకరణ పనులు ఎమ్మెల్యే స్వయంగా చేసి సిద్ధం చేశారు. కావలి అభివృద్ధి కోసం పూర్తి వివరాలతో ప్రణాళిక సిద్ధం చేశారు. దీని వలన ప్రభుత్వ అధికారుల పనులు మరింత సులభమయ్యాయని పేర్కొన్నారు. కావలి అభివృద్ధికి కీలకమైన ఈ దగదర్తి విమానాశ్రయం ప్రాజెక్టు పూర్తి అయితే, జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా విశేషంగా దోహదపడనుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు..