కావలిలో మువ్వన్నెల పండుగ: ఆర్డీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి | స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు అమరం..ఉత్తమ అధికారులకు, సిబ్బందికి రివార్డులు అందజేత
కావలి, శనివారం ఆగస్టు :15
దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కావలి పట్టణంలోని ఆర్డీఓ (RDO) కార్యాలయం మరియు మున్సిపల్ కార్యాలయాల ప్రాంగణాల్లో జాతీయ జెండా పండుగ అత్యంత వైభవంగా జరిగింది. రెండు కార్యాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.ఆర్డీఓ కార్యాలయంలో రివార్డుల ప్రధానం
ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జాతీయ జెండాకు సెల్యూట్ చేసి స్వాతంత్ర్య సమరయోధుల అసమాన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, అధికారి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని సూచిస్తూ, ప్రజలకు పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. విధుల పట్ల అంకితభావం కనబరిచిన పలువురు ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, రివార్డులను అందజేశారు.అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ప్రాంగణంలోని మహాత్మా గాంధీతో పాటు ఇతర స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. స్వాతంత్ర ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తికి కూడా అందాలని, కావలి పట్టణాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కోరారు. వేడుకల అనంతరం అధికారులు, సిబ్బంది, విద్యార్థులు మరియు ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ వేడుకల్లో కావలి ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, వివిధ డివిజనల్ అధికారులు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, విద్యార్థులు మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.