ఏ ఒక్క ఎకరా ఎండిపోకుండా రైతాంగాన్ని ఆదుకుంటాం

 ఏ ఒక్క ఎకరా ఎండిపోకుండా రైతాంగాన్ని ఆదుకుంటాం

కావలి కాలువ పరిధిలో  ప్రణాళికాబద్ధంగా చివరి వరకు సాగునీరు అందించేలా నిర్ణయం

సైఫన్ పునర్నిర్మాణంతో పాటు కావలి కాలువ ఆధునికీకరణకు చర్యలు

కావలి, ఉదయగిరి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్

కలెక్టర్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన సమీక్ష

కావలి కాలువపై వారాబంధీ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలి : కలెక్టర్ 

నెల్లూరు, ఆగస్టు 3: కావలి నియోజకవర్గంలో ఏ ఒక్క ఎకరా పంట కూడా ఎండిపోకుండా రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు.

కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన సోమవారం సాయంత్రం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కావలి కాలువలో నీటి నిర్వహణ, 12వ కిలోమీటరు వద్ద దెబ్బతిన్న సైఫన్, చివరి ఆయకట్టు వరకు సాగునీటి సరఫరాపై విస్తృతంగా చర్చించారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల ప్రతినిధులు, రైతులు సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించి రైతులకు సమన్యాయం జరిగేలా కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. కావలి కాలువ పరిధిలోని ఇంజన్ మోటార్లు గల రైతులకు వారానికి మూడు రోజులు సాగునీరు అందించే విధంగా కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, మిగిలిన నాలుగు  రోజుల్లో అనధికార మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసి కాలువ చివరి భాగంలోని రైతులకు కూడా సమానంగా నీరు అందేలా చర్యలు చేపడతామని చెప్పారు.

కావలి చెరువును నింపడంతో పాటు చెరువు కింద ఆయకట్టు, ఎస్‌విపీఎం పరిధిలోని రైతులకు కూడా సాగునీరు అందేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. రైతులు అపోహలకు గురికాకుండా పరస్పర సహకారంతో వ్యవహరిస్తే ఏ ఒక్క రైతుకూ నష్టం జరగకుండా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని పేర్కొన్నారు. సోమశిలలో నీటి లభ్యత ఉందని, శ్రీశైలం నుంచి కూడా నీటి ప్రవాహం కొనసాగుతోందని, త్వరలో మరింత నీరు చేరుతుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, కావలి కాలువ 12వ కిలోమీటరు వద్ద దెబ్బతిన్న సైఫన్‌ను స్వయంగా పరిశీలించామని, దీని కారణంగా చివరి ఆయకట్టు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అనధికార మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసి చివరి వరకు సాగునీరు అందించేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో సైఫన్‌ను శాశ్వత ప్రాతిపదికన పునర్నిర్మించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కావలి కాలువలో దెబ్బతిన్న ఇతర నిర్మాణాలు, గేట్ల మరమ్మతులు కూడా వెంటనే చేపట్టాలని సూచించినట్లు చెప్పారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన ఇరిగేషన్ వ్యవస్థను ఆధునికీకరించి రైతులకు రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ, కావలి కాలువ రైతాంగానికి సాగునీరు అందించేందుకు ప్రణాళికాబద్ధంగా నీటి నిర్వహణ చేపట్టాలని, ఈరోజు నుంచే వారాబందీ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, నీటి విడుదల జరిగే నాలుగు రోజులపాటు కాలువపై ఉన్న మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని సూచించారు. సెప్టెంబర్ 15 వరకు ఏ కాలువకు ఎంత మేర నీటిని విడుదల చేయాలనే కార్యాచరణను సిద్ధం చేయాలని, ప్రతి రైతు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.

కావలి కాలువలోని సైఫన్‌తో పాటు దెబ్బతిన్న అన్ని నిర్మాణాల మరమ్మతులకు అవసరమైనంత నిధులు వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, టెండర్లు పిలిచి నీటి ప్రవాహం నిలిచిన వెంటనే పనులు ప్రారంభించి నవంబర్ 30లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాలువ ఆధునికీకరణతో పాటు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సమావేశంలో సోమశిల ఎస్‌ఈ శ్రీరామ్ చంద్రమూర్తి, ఇరిగేషన్ ఎస్‌ఈ దేశ నాయక్, కందలేరు ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం, ఎలక్ట్రికల్ ఎస్‌ఈ రాఘవేంద్ర, ఆత్మకూరు, కావలి ఆర్డీవోలు పావని, ఎలీషా, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, నీటి సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

google+

linkedin

Popular Posts