కావలిలో మీడియా భవన్‌కు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న.. జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యే..
జర్నలిస్టుల కల నెరవేర్చిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..
కావలి: ఆదివారం,15
కావలి పట్టణంలో మీడియా రంగానికి సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. స్థానిక విలేకరుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ చేపట్టిన మీడియా భవన్ నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన జరిగింది. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు కలసి వేద మంత్రోచ్ఛారణల నడుమ మీడియా భవన నిర్మాణానికి శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఈ వేడుకకు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, భారీ సంఖ్యలో పాత్రికేయులు మరియు స్థానిక ప్రజలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, సమాజహితం కోసం నిరంతరం శ్రమించే జర్నలిస్టులకు మెరుగైన వసతులు కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతోనే ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగటం అదృష్టమని కావలిలో మీడియా రంగానికి పూర్తిస్థాయి ప్రోత్సాహం అందించే దిశగా ఈ భవన నిర్మాణం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. అందరి సహకారంతో భవన నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.నూతనంగా రూపుదిద్దుకోనున్న ఈ మీడియా భవన్ పాత్రికేయుల వృత్తిపరమైన అవసరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విలేకరులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్లు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు ఆధునిక వసతులతో ఈ భవనం అందుబాటులోకి రానుండడం పట్ల స్థానిక జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.