కూటమి వంద రోజుల పాలన అత్యద్భుతం
- ప్రజల్లో అభద్రతాభావం తొలగింది
- కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రజా ప్రభుత్వ పాలన అభివృద్ధి దిశగా ఎన్నో అడుగులు వేసిందని, వంద రోజుల పాలన అత్యద్భుతమని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలకు వివరిస్తూ, రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను వివరిస్తూ శుక్రవారం కావలి పట్టణంలోని 26వ వార్డులో ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళుతూ కరపత్రాలు అందజేశారు. వార్డుకు విచ్చేసిన ఆయనకు స్థానిక నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ప్రజల్లో అభద్రతా భావం తొలగిపోయిందని, స్వేచ్ఛగా జీవిస్తున్నారని తెలిపారు. ఏరోజుకొస్తాయో తెలియని ఉద్యోగుల, పెన్షన్‌దారుల జీతాలు ఠంఛనుగా ఒకటినే జమ చేస్తున్నామన్నారు. అరకొర పింఛన్ స్థానంలో పెంచిన పెన్షన్ నేరుగా లబ్ధిదారుల ఇంటికే అందజేత కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. అన్న క్యాంటీన్లకు అయిదేళ్ల గ్రహణం వీడి పేదోడి ఆకలి తీర్చుతూ కళకళ లాడుతున్నాయన్నారు. ఖాళీ ఖజానా నుంచి మళ్లీ ఆర్థిక పరిపుష్టి దిశగా పంచాయతీలు పయనం సాగుతుందన్నారు. ఈ వంద రోజుల్లో పంచాయతీలకు కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులు జమ చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో సూపర్‌సిక్స్ పథకాలు ప్రకటించిందని, అందులో ఒక్కో హామీని వడివడిగా అమలుచేస్తోందన్నారు. ఇప్పటికే పింఛన్ల పెంపు అమలు చేసిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగిందన్నారు. డిఎస్సీ ప్రకటించడం జరిగిందన్నారు. అలాగే విజయవాడ వరద బాధితులకు సత్వర సహాయక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, మున్సిపల్ డిఈ సాయి రామ్, కావలి పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు, గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, జ్యోతి బాబు రావు, పోతుగంటి అలేఖ్య, గంగినేని వెంకటేశ్వర్లు, బీజేపీ పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం, జనసేన నాయకులు పొబ్బా సాయి విఠల్, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు..