భారతదేశంలో ఉగ్రవాదులు ఎక్కడున్నా నిర్దాక్షిణ్యంగా ఏరివేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాదుల దాడిలో అసువులుబాసిన కావలి వాసి మధుసూదన్ భౌతికకాయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణ కాంత్, పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు.
గురువారం కావలిలోని మధుసూదన్ స్వగృహానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. సోమిశెట్టి మధుసూదన్ రావు భౌతిక కాయం వద్ద శోకతప్త హృదయాలతో ఘన నివాళులర్పించారు. మధుసూదన్ భార్య, పిల్లలతో ఉగ్రవాదుల దాడి విషయాలను అడిగి తెలుసుకుని... వారు ఆ సమయంలో అనుభవించిన మానసిక క్షోభ, దయనీయ పరిస్థితుల పట్ల ఆవేదనతో చలింపోయారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇది అత్యంత హృదయ విదారక సంఘటన అని, భారతదేశం దీనిని మరచిపోదన్నారు. బాధిత కుటుంబ సభ్యుల బాధ, వారు అనుభవిస్తున్న మానసిక క్షోభ మాటల్లో చెప్పలేనిదిగా పవన్ భావోద్వేగంతో మాట్లాడారు. సంఘటనను తలుచుకుంటుంటే తన కడుపు రగిలిపోతుందని ఆవేదనకు గురయ్యారు. పర్యాటకులను మీది ఏ మతం అని, ఏ ధర్మం ఆచరిస్తారని అడిగి మరి ఉగ్రవాదులు ఘోరంగా, కిరాతకంగా చంపేశారన్నారు. బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వడానికో.. ఇక్కడికి రాలేదని ఆ కుటుంబాలకు, ఆ బిడ్డలకు తోడుగా ఉంటామని భరోసా కల్పించేందుకే వచ్చినట్లు పవన్ చెప్పారు. గత పదేళ్లుగా కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం ఉందని.. ఈ భరోసాతోనే పర్యాటకులు కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళుతున్నారని చెప్పారు. 1986-89 మధ్యకాలంలో సినిమా షూటింగ్ ల కోసం తను కాశ్మీర్ కు ప్రతి సంవత్సరం వెళ్లే వాడినని, అక్కడ పరిస్థితులు తనకు బాగా తెలుసు అన్నారు. మళ్లీ అలాంటి పరిస్థితిలే పునరావృతం కావడం చాలా బాధాకరంగా పవన్ అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై మంగళగిరిలో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు పవన్ చెప్పారు. ఉగ్రవాదుల అణచివేతకు భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని పవన్ అన్నారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ 28 మంది భారతీయులను ఎక్కడికక్కడ పేర్లు అడిగి మరీ ఉగ్రవాదులు పాశవికంగా చంపడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. పేర్లు అడిగి చంపడం మీ నాయకులకు చెప్పుకోండి, మీ ప్రధానమంత్రిగా చెప్పుకోండి అని దారుణంగా చంపడం పిరికిపందల చర్యగా మంత్రి ఆనం అన్నారు. ప్రపంచ దేశాలన్నీ నేడు భారతదేశం వైపు చూస్తున్నాయని, ఈ ఉగ్రవాద సంస్థలను అణిచివేయడానికి మేము తోడుగా ఉన్నామని చెప్పి అన్ని దేశాలు ఒక తాటిపైకొస్తున్నాయన్నారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు (ఒకరు విశాఖపట్నం నుంచి మరొకరు కావలి) నుంచే చనిపోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు.
మధుసూదన్ పార్థివ దేహం కావలికి వచ్చినప్పటి నుంచి జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడే ఉందన్నారు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా అండగా ఉంటుందని తెలియజేశారు. శాంతి సామరస్యానికి ప్రతిరూపమైన ఈ భారతదేశంలో ఇటువంటి దేశంలో ఈ ఉగ్రవాద చర్య హేయమైన చర్యగా మంత్రి ఆనం ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ఇటువంటి ఘటనలనూ ఎవరు సమర్ధించరన్నారు. ఈ దురదృష్టకరమైన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మేమున్నామంటూ భరోసా ఇస్తున్నాయని చెప్పారు.
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ కుటుంబం నెల్లూరులో మా పక్క వీధిలో ఉండే వారని, వారి కుటుంబంతో తమకు మంచి అనుబంధ ఉందని మంత్రి ఆనం చెప్పారు. మధుసూదన్ ను కోల్పోవడం తమ కుటుంబంలో వ్యక్తిని కోల్పోయినట్లుగా భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. మధుసూదన్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పది లక్షల రూపాయలు ప్రకటించినట్లు మంత్రి చెప్పారు. మధుసూదన్ కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు మంత్రి ఆనం చెప్పారు.
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఏప్రిల్ 22 దేశ చరిత్రలో ఒక చీకటి రోజుగా నిలిచిపోతుందన్నారు. దేశంలో సమర్థవంతమైన నాయకత్వంలో గత పదేళ్లుగా జమ్మూ కాశ్మీర్ ప్రశాంతంగా ఉందని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న జమ్మూ కాశ్మీర్లో మతం పేరుతో అత్యంత పాసవికంగా వ్యవహరించడం 145 భారతీయుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. సమాచారం తెలిసిన కొన్ని గంటల్లోనే సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ వెంటనే తిరిగి వచ్చేసారని, హోం మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ పెళ్లి పరిస్థితిని సమీక్షించారని సత్య కుమార్ చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా ఉంటాయని, వారి బిడ్డల ఉజ్వల భవిష్యత్తుకు సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు.
కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలిలో ఇదొక బ్లాక్ డే గా ఎమ్మెల్యే అన్నారు. పేద కుటుంబం నుంచి ఉన్నతంగా ఎదిగి మంచి వ్యక్తిత్వం గల మధుసూదన్ మృతి చెందడం దురదృష్టకరమన్నారు. భార్య, బిడ్డల కళ్ళముందే ఇలాంటి ఘటన జరగడం.. వారి ఆవేదన, బాధ వర్ణనాతీతమన్నారు. భారతీయులందరూ దేశానికి మద్దతు పలకాలన్నారు. కులమత రాజకీయాలు పక్కన పెట్టి అందరం ఏకమవుదాం... ఉగ్రవాదులను అంతమొందిద్దామవి పిలుపునిచ్చారు. దేశ రక్షణ, భద్రత కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రజలందరూ అండగా నిలబడుతామని చెప్పారు.
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇది పిరికిపందల చర్య అని చెప్పారు. ఈ కిరాతకు ఘటనకు సంబంధించి కనీసం పాకిస్తాన్ సరైన పద్ధతిలో సానుభూతి కూడా తెలపలేదని సోమిరెడ్డి మండిపడ్డారు. ఇలాంటి కిరాతకమైన ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను వదిలి ప్రసక్తే లేదని... భారత్ జోలికి వచ్చిన వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సోమిరెడ్డి అన్నారు.
కన్నీటి వీడ్కోలు మధ్య మధుసూదన్ అంతిమయాత్ర
- అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రులు సత్య కుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్
కావలి ప్రజలు, బంధువులు, మిత్రులు వెంటరాగా మధుసూదన్ రావు అంతిమయాత్ర ఘనంగా నిర్వహించారు. మధుసూదన్ రావు అమర్ రహే అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కావలి పట్టణవాసికి కన్నీటితో వీడ్కోలు పలికారు. మంత్రులు సత్య కుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ అంత్యక్రియల్లో పాల్గొని పాడెను మోశారు.
జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణ కాంత్, ఆర్టీవో వంశీకృష్ణ, అధికారులు, పోలీసులు ఏర్పాట్లను పూర్తిస్థాయిలో పర్యవేక్షించారు.