ఘనంగా బాబు జగ్జీవనరావు జయంతి వేడుకలు - ఘన నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
దేశానికి ఎనలేని సేవలందించిన సామాజిక యోధుడు, ప్రజాసామ్యవాది బాబు జగ్జీవనరావు జయంతిని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కావలి పట్టణంలోని ముసునూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, మాగుంట పార్వతమ్మ రోడ్డులోని బాబు జగ్జీవనరావు విగ్రహం వద్ద ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంటరాని తనాన్ని రూపుమాపాలని, అణగారిన వర్గాలకు రాజకీయ, ఆర్థిక, సామాజికంగా సమాన హక్కులు కల్పించాలనే సంకల్పంతో తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు బాబు జగ్జీవనరావు అని అన్నారు. దాదాపు 40 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా, ఉప ప్రధాని గా, వివిధ కమిటీల చైర్మన్‌గా దేశానికి సేవలందించారని తెలిపారు. 1906లో జన్మించిన బాబు జగ్జీవనరావు స్వాతంత్ర్య సమరంలోనూ కీలకంగా పాల్గొన్నారని, 1930లోనే అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని ప్రారంభించి, 1935లో "డిప్రెస్డ్ క్లాసెస్" సమస్యను దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారన్నారు. ఆయన పోరాటం వల్లే భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లకు బలమైన పునాది పడిందని తెలిపారు. కావలిలో ఆయన స్మారక స్థూపాన్ని, భవనాన్ని నిర్మించనున్నట్లు, అలాగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనాన్ని కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. వీటితో పాటు లైబ్రరీని ఏర్పాటు చేసి బాబు జగ్జీవనరావు జీవిత చరిత్రను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, చంద్రబాబు నాయుడు జన్మదినాలతో కలిపి, ఈ ఏప్రిల్ నెలను త్రిమూర్తుల జన్మ మాసంగా భావించాలన్నారు. ఈ ముగ్గురు మహానుభావుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీవో సన్నీ వంశీ కృష్ణ, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు,
రాష్ట్ర కార్యదర్శులు మలిశెట్టి వెంకటేశ్వర్లు, మొగిలి కల్లయ్య, కండ్లగుంట మధు బాబు నాయుడు, పోట్లూరు శ్రీనివాసులు, పోతుగంటి శ్రీకాంత్, ఏగూరి చంద్రశేఖర్, దావులూరు దేవకుమార్, అర్షియా బేగ, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.