అమృత్ పథకంలో భారీ స్థాయిలో అవినీతి

 అమృత్ పథకంలో భారీ స్థాయిలో అవినీతి 

- జర్నలిస్ట్ ల ముసుగులో అమృత్ పైలాన్ విధ్వంసం 

- వాస్తవాలు తెలియజేయడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత

- ముఖ్యమంత్రి ఆశీస్సులతో ఏడాదిలోనే అభివృద్ధి పథంలో కావలి

- గత ఐదేళ్ల విధ్వంసక పరిపాలన పై మండిపడ్డ కావలి ఎమ్మెల్యే 

కావలి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రవేశపెట్టిన అమృత్ పథకం పనుల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని, కోట్ల రూపాయలు దిగమింగారని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు తెలిపారు. జూన్ 4వ తేదికి ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం అవుతున్న సందర్భంగా మంగళవారం ఆయన వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, స్వచ్చంద సంస్థలు, పుర ప్రముఖులు, వివిధ వర్గాల వారికి ఏడాదిలో జరిగిన అభివృద్ధి, గత ఐదేళ్ల కాలంలో జరిగిన విధ్వంసం పై కావలి పట్టణంలోని దొడ్ల మనోహర్ రెడ్డి కల్యాణ మండపంలో పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు. అమృత్ పథకం పైలాన్ కూల్చబోతున్నారన్న సమాచారం ఉందని,  కూల్చవద్దని, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, అప్పటి డిఎస్పీ, కమిషనర్, తహసీల్దార్ లకు ఏప్రిల్ 10, 2020 న జర్నలిస్ట్ లు అందజేసిన లేఖను, అదే రోజు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జూన్ 12వ తేదీన ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తానని తెలిపిన వీడియో, 11వ తేదీ రాత్రి జరిగిన విధ్వంసం, మందాడి చెరువులో వాటి శిదిలాల వీడియోను ఈ సందర్భంగా బహిర్గతం చేశారు.

పైలాన్ స్థలంలో ప్రెస్ క్లబ్ వద్దని జర్నలిస్ట్లు వారించినా మాజీ ఎమ్మెల్యే పెడ చెవిన పెట్టారని, 11వ అర్ధరాత్రి కూల్చి, 12వ తేదీ ఆ స్థలంలో శంకుస్థాపనకు రావడం కూడా జరిగిన విషయాన్ని మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, మాజీ ఏఎంసి చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి తెలిపిన వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు. పైలాన్ లో జరిగిన అవినీతి కనబడకుండా ఉండటానికి, జర్నలిస్ట్ లు అడ్డు పెట్టుకొని ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తానని వారి నమ్మించి వారిని మోసం చేయడం జరిగిందన్నారు. ఈ కూల్చివేత విషయంలో జర్నలిస్ట్ లు మౌనంగా ఉండటంతో అప్పట్లో ఏ పేపర్, టివి లలో ఈ వార్త వెంటనే రాలేదని తెలిపారు. ప్రభుత్వ ఆస్థి అయిన పైలాన్ ధ్వంసం అయితే ఆ పైలాన్ ని ఆఫ్ట్రాల్ అంటూ ప్రతాప్ రెడ్డి మాట్లాడాటం దుర్మార్గం అన్నారు. రూ.57.92 కోట్లతో అమృత్ పధకం టెండర్లను కేఎస్ఎల్ఆర్ కంపెనీ దక్కించుకుందని, ట్యాంకులు మాత్రమే కట్టారని, 160 కిలోమీటర్ల పైప్ లైన్లకు గాను 83 కీమీ పైప్ లైన్ వేయకుండా రూ.13 కోట్లు దోచుకున్నారని, ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో నిజం బయటకు రావాలన్నారు. పైప్ లైన్ వేయకుండా తాగునీటి కొరత సృష్టించడం ద్వారా గత వైసిపి ప్రభుత్వం ఐదేళ్లు నీటి ట్యాంకర్ల తో రూ.9.55 కోట్ల నిధులు వెచ్చించడం జరిగిందన్నారు. పనులు జరగకపోవడం వలన అమృత్ పథకం క్రింద ప్రజల నుండి వసూలు కావలసిన నీటి పన్ను 4.51కోట్లు కోల్పోవలసి వచ్చిందన్నారు. దీని వలన రూ.27 కోట్ల తాగునీటి బారం మున్సిపాలిటీపై పడిందన్నారు. అమృత్ పథకానికి మున్సిపాలిటీ రూ.51.92 కోట్ల రుణాలు తెచ్చిందని,  అసలు తీర్చకపోగా ఇప్పటికీ వడ్డీ చెల్లిస్తుందన్నారు. మున్సిపల్ ఎన్నికలు జరగకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేదని తెలిపారు. కావలి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగితే కౌన్సిల్ కు అన్నీ తెలుస్తాయని, ఎన్నికలు జరగకుండా చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి దన్నారు. ప్రెస్ క్లబ్ కోసం అమృత్ పైలాన్ ధ్వంసం చేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి ఐదేళ్లలో పైలాన్ ఎందుకు కట్టించలేక పోయాడని ప్రశ్నించారు. ఇదే అమృత్ పైలాన్ ను నా సొంత నిధులతో శంకుస్థాపన చేసి నిర్మిస్తాని తెలిపారు. 94 శాతం అమృత్ పథకం పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారని, కానీ పనులు మాత్రం చేయలేదని, దోషులను శిక్షించేందుకు విజిలెన్స్ కమిటీ వేద్దామా? అని ప్రజలను ప్రశ్నించారు. నీటి శుద్ది ప్లాంట్ 84 శాతం పూర్తి చేశారని చెబుతున్నా పనులు చేయలేదని, ఇక్కడా డబ్బులు దోచేశారని తెలిపారు. ఉదయగిరి రోడ్డులోని జాతీయ రహదారిపై మున్సిపాలిటీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి వచ్చే పైప్ లైన్ ధ్వంసం చేశారని, దీని విలువ 7.40 కోట్లు అని, ఎలాంటి నష్ట పరిహారం జాతీయ రహదారి సంస్థ నుండి రాబట్ట కుండా కాంట్రాక్టర్లతో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కుమ్మక్కు అయ్యాడని మండిపడ్డారు. దానిని ప్రస్తుతం రికవరీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఒక్క తాగునీటి పథకం లోనే రూ.35 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో కావలి నియోజకవర్గం అభివృద్ధి పథంలోదూసుకెళ్తుందని తెలిపారు.

ఏడాది లో జరిగిన అభివృద్ధి ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివరించారు. దగదర్తి మండలంలోని కౌరుగుంట నుండి కావలి రూరల్ మండలంలోని లక్ష్మీపురం వరకు గల రైల్వే గేట్ల వద్ద ఆర్వోబి, ఆర్ యుబి ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని, పలు చోట్ల రైల్వే బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రూ. 13.48 కోట్లతో కావలి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే అమృత్ 2.0 కు రూ.15.26 కోట్లు, యుఐడిఎఫ్ నిధులు 22.8 కోట్లతో పనులకు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. కావలి లో చిరు వ్యాపారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేందుకు మునిసిపాలిటీ ఆధ్వర్యంలో 360 షాపులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పలుచోట్ల షాపులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నూతన కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని, టౌన్ హాల్ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మున్సిపాలిటీలోని ప్రతి ఇంటి నుండి 100 శాతం చెత్తను సేకరిస్తున్నామని, బిన్ ఫ్రీ సిటీగా మారుస్తున్నామని తెలిపారు. దశాబ్దాలుగా మరమ్మత్తులకు నోచుకోని ఉదయగిరి బ్రిడ్జికి మరమ్మత్తులు చేపట్టడం జరిగిందని తెలిపారు. అనేక చోట్ల సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని, భాష్యం స్కూల్ నుండి మున్సిపల్ ప్లాట్స్ వరకు 27.5 కోట్లతో జాతీయ రహదారిని విస్తరిస్తున్నామని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన కావలి - తుమ్మలపెంట రోడ్డు, దగదర్తి - బుచ్చి రోడ్డులకు మోక్షం కలిగిస్తూ కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు చేయిస్తున్నామని, త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.

కావలి మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన మాగుంట పార్వతమ్మను స్మరించుకుంటూ కావలి ట్రంకు రోడ్డుకు మాగుంట పార్వతమ్మ రోడ్డుగా ప్రభుత్వం తో జీవో జారీ చేయించడం జరిగిందన్నారు. 58.82 కోట్లతో ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో రోడ్ల పనులు చేపడుతున్నామని తెలిపారు. రైతులకు సాగునీరు అందించే డిఆర్, డిఎం ఛానల్ పనులు శర వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  మెట్ట ప్రాంతానికి కూడా రెండో పంటకు నీరు అందించడం జరిగిందని తెలిపారు. రూ.48.48 కోట్లతో పంచాయతీ రాజ్ పనులు చేస్తూ ఉన్నామని తెలిపారు. జల జీవన్ మిషన్ తో గ్రామాల్లో ప్రతి ఒక్కరికి త్రాగునీరు అందిస్తున్నామని తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపెడుతున్నామని, కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రూ. 24 కోట్లతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఏరియా హాస్పిటల్ లో సౌకర్యాల కల్పన కోసం రూ.44 లక్షల ఎంపీ నిధులతో పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలిపారు. రైతు బజార్ ను పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచడానికి రూ.38 లక్షలతో పనులను చేపట్టినట్లు తెలిపారు. కావలి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, కావలిని కాపు కాస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

google+

linkedin