ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ
కావలి నియోజకవర్గంలోని 96 మంది లబ్ధిదారులకు రూ. 71,66,072 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అందజేశారు. శనివారం కావలి పట్టణంలోని సెల్ఫీ పాయింట్ వద్ద 100 అడుగుల ఎత్తులోని జాతీయ జెండా నీడన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడి, పలు కార్పొరేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొంది ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించని, సొంత నిధులు వెచ్చించుకున్న అర్హులైన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయని, ముఖ్యంగా వైద్య రంగంలో అందుబాటులో ఉన్న ఈ సేవలు అనేక కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నాయని ఆయన వివరించారు.
రాష్ట్ర స్థాయిలో అత్యధికంగా రికార్డు స్థాయిలో కావలి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇప్పటివరకు 534 మంది లబ్ధిదారులకు రూ. 5,11, 84,072 ఆర్ధిక సహాయం అందజేయడం జరిగిందని తెలిపారు. నిరంతరం రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్ళు కస్టపడి పనిచేస్తున్నారని తెలిపారు.
ప్రజల సంక్షేమం కోసం, ముఖ్యంగా పేదల ఆరోగ్య సంరక్షణ కోసం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో నిలిచి ఉంటుందని ఆయన ఆకాంక్షించారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రభుత్వం అందిస్తున్న సహాయం వారి జీవితాల్లో కొత్త ఆశలను నింపిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య, కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, సీనియర్ నాయకుడు మధుబాబు నాయుడు, బోగోలు మండల టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, అల్లూరు మండల టీడీపీ అధ్యక్షులు బండి శ్రీనివాసులు రెడ్డి, దగదర్తి మండల టీడీపీ అధ్యక్షులు అల్లం హనుమంతరావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బీద గిరిధర్, కొండూరు పాల్ శెట్టి, లబ్ధిదారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..