దశాబ్దాల కల నెరవేర్చిన కావలి ఎమ్మెల్యే
- 238 ఎకరాల భూమి పట్టాలను 238 కుటుంబాలకు అందజేత
- మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని తెలిపిన ఎమ్మెల్యే
- పలు గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
మూడు దశాబ్దాలుగా ప్రజలకు అందని ద్రాక్షాలా ఉన్న భూ పంపిణీకి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి శ్రీకారం చుట్టి దగదర్తి మండలం వెలుపోడు గ్రామ ప్రజల కలను నెరవేర్చారు. శనివారం వెలుపోడు గ్రామంలో జరిగిన భూపంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని భూమి పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. 238 ఎకరాల భూమిని 238 కుటుంబాలకు అందజేసి శెభాష్ అని అనిపించుకున్నారు. ఎన్నికలకు ముందు వెలుపోడు గ్రామ ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చి ఎమ్మెల్యే మాట నిలుపుకున్నారు.
ముందుగా దగదర్తి మండలం వెలుపోడు, తురిమర్ల గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. డోర్ టు డోర్ తిరిగి ప్రజల అవసరాలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలను స్వీకరించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు ఆయా గ్రామాలు ప్రజలు పూల వర్షం కురిపిస్తూ మేల తాళాలతో భారీగా బాణాసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం మాటల ప్రభుత్వమని మా ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని చెప్పేందుకే ఈ భూపంపిణీ కార్యక్రమమే నిదర్శనం అన్నారు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపదను సృష్టించుకుంటూ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం అమ్మ ఒడి ఒక్కరికి ఇస్తే మన ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం క్రింద రూ.13వేలు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. ఇప్పటికే ఉచిత గ్యాస్ ఇచ్చామన్నారు. ఆగస్టు నెలలోనే మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా అమలు చేయబోతున్నారన్నారు.
కావలి నియోజకవర్గ ఎన్నికల చరిత్రలో ఎన్నడు లేని మెజార్టీని తనకు ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కావలిని కాపు కాసుకుంటానని తెలిపారు. తాను నిరుపేద రైతు కుటుంబంలో జన్మించానని రైతులు, సామాన్య ప్రజలు పడే కష్టం తెలుసన్నారు. రైతులకు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఏ కష్టం కలగకుండా కన్నుని కనుపాప ఎలా కాపాడుతుందో అలాగే కావలి ప్రజలను కాపు కాసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి, దగదర్తి మండల అధ్యక్షులు అల్లం హనుమంతరావు, జలదంకి శ్రీహరి నాయుడు, రవి రెడ్డి, ఎంపిపి తాళ్లూరి ప్రసాద్ నాయుడు, స్థానిక సర్పంచ్, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..