రాష్ట్ర మహిళా లోకాన్ని జగన్ రెడ్డి కించపరచడం దారుణం

 రాష్ట్ర మహిళా లోకాన్ని జగన్ రెడ్డి కించపరచడం దారుణం

- తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు 


మహిళా లోకాన్ని అసభ్య పదజాలంతో అవమానించిన కోవూరు వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డిపై రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా వైసీపీ అధినేత జగన్ రెడ్డి వెనకేసుకు రావడం రాష్ట్ర మహిళా లోకాన్ని కించపరచడమేనని, ఇది చాలా దారుణమని టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు తెలిపారు. బుధవారం కావలి టీడీపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ చెల్లి వరుసయ్యే ఒక మహిళ వ్యక్తిత్వ హననం చేసేలా సభ్య సమాజం తలదించుకునేలా చేసిన వ్యాఖ్యలపై ఈరోజు వరకు ప్రసన్నకుమార్ రెడ్డి క్షమాపణలు చెప్పలేదని, దీనిని జగన్మోహన్ రెడ్డి ఖండించలేదని మండిపడ్డారు. ఒక మహిళా శాసనసభ సభ్యురాలపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు కోర్టు సైతం తప్పు పట్టిందని గుర్తు చేశారు.

పబ్లిక్ లో మహిళలపై నీచంగా వ్యాఖ్యలు చేసిన నేతలపై వైసీపీ పార్టీ ఏనాడూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరి కదా, ప్రశ్నించిన వారిపైనే అక్రమ కేసులు పెట్టించారని, అధికారం కోల్పోయిన ఇంకా మహిళల పట్ల అదే పంథా కొనసాగిస్తున్నారని తెలిపారు. కోవూరు నియోజకవర్గంలో 50 వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డిపై గెలిచి వేమిరెడ్డి దంపతులు చక్కటి ప్రజా సంబంధాలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నారని తెలిపారు.

కోవూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా పట్టుకోవడానికి కార్యకర్తలు కూడా కరువయ్యారని, ఇటువంటి పరిస్థితుల్లో జగన్ మెప్పు కోసం మహిళా ఎమ్మెల్యేను కించపరుస్తూ ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉన్నత న్యాయస్థానాలు సైతం తప్పుపట్టాయి కానీ జగన్ రెడ్డి మాత్రం ఇంతవరకు స్పందించకుండా ప్రసన్నకుమార్ రెడ్డిని వెనకేసుకు రావడం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. వైసీపీ పార్టీ ప్రశాంత వాతావరణానికి ఆటంకం కలిగిస్తూ, అలజడి సృష్టిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలనే కుట్రలో భాగంగానే వైసీపీ నేతలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లి గురించే తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదని విమర్శించారు. జగన్ రెడ్డి మద్దతుతోనే వైసీపీ నేతలు మహిళల పట్ల పేట్రేగిపోతున్నారన్నారు.

వెంటనే జగన్ రెడ్డి యావత్ మహిళా లోకానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. మహిళలను సంకరజాతి అని సజ్జల, వేశ్యలని మరొక నేత నిస్సిగ్గుగా అవమానించినా జగన్ రెడ్డి వారిని సమర్థించడం హేయనీయం అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తూ, వ్యక్తిగత విమర్శలు చేస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం అత్యంత హేయమైన చర్య అని, వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇదే నీచ రాజకీయం కొనసాగిస్తోందన్నారు. వెంటనే మహిళా నేతకు, మహిళలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిరివీధి ప్రసాద్, ఖమర్ బాబు, కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం, మహిళలు, తదితరులు పాల్గొన్నారు..


google+

linkedin