నిస్వార్థంగా సేవలు అందించేవారు ప్రజల హృదయాలలో నిలిచిపోతారు
- ప్రజల ప్రాణాలను కాపాడుతున్న రక్తదాతలు ధన్యులు
- కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
- ఘనంగా జరిగిన ప్రపంచ రక్తదాతల దినోత్సవాల ముగింపుసభ
నిస్వార్థంగా సేవలు అందించేవారు ప్రజల హృదయాలలో నిలిచిపోతారని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాలు -2025 ముగింపు కార్యక్రమం శ్రీనివాసం కల్యాణ వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గత సంవత్సరం రక్తదాన శిబిరాలు నిర్వహించిన సంస్థలు, రక్తదాన ప్రేరేపకులకు పురస్కారాలు, సాంస్కృతిక పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. నిబద్దత, నిజాయితీ, నిస్వార్ధతలతో పనిచేసేవారు ప్రజల హృదయాలలో నిలిచిపోతారని, కావలి పట్టణంలో రెడ్ క్రాస్, ఐయంఏ, రోటరీక్లబ్, టీం సేవియర్స్, సంయుక్త, అభయం, జన విజ్ఞాన వేదిక సంస్థలు తాము ప్రభుత్వపరంగా చేసే సంక్షేమ కార్యక్రమాలకు సమాంతరంగా సేవలు అందిస్తున్నాయని అభినందించారు. కావలి లాంటి చిన్న పట్టణంలో వేలాదిమంది రక్తదాతలు ఉండడంలో రెడ్ క్రాస్ పాత్ర ప్రముఖమైనదని అని అన్నారు.
రాష్ట్ర స్థాయిలో ప్రతీ సంవత్సరం రక్తదాతల సమీకరణలో ప్రధమస్థానంలో నిలవడం తనకు కూడా గర్వకారణం అని ఆయన వివరించారు. కావలి రెడ్ క్రాస్ అధ్యక్షులు, ఆర్డీఓ యం వంశీకృష్ణ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సేవలను విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న రెడ్ క్రాస్ రాష్ట్ర కోశాధికారి పి రామచంద్రరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని జిల్లా శాఖలతో పోటీ పడుతూ, కావలి సబ్ బ్రాంచ్ కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పేదరిక నిర్మూలనలో భాగస్వామ్యం అవుతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముందుగా వివిధ పాఠశాలల విద్యార్థులు తమ గాన, నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. సంయుక్త నృత్య కళా నిలయం వారు ప్రదర్శించిన లఘునాటిక, రక్తం దొరకక ప్రజలు పదే ఇబ్బందులను కళ్ళకు కట్టినట్లు చూపి ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ఈ కార్యక్రమంలో గత సంవత్సరం అత్యధికంగా రక్తసేకరణ శిబిరాలు నిర్వహించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ( ఐయంఏ ), అభయం, టీం సేవియర్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండోసోల్ సోలార్, వంటేరు వరదారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తదితరుల సంస్థల ప్రతినిధులు, యన్ టి ఆర్ వర్ధంతి సందర్బంగా రక్తదాన శిబిరం నిర్వహించిన గుత్తికొండ కిషోర్ బాబు, ఆవుల రామకృష్ణ, యం వి సిద్దు, ఆలా శ్రీనాథ్ తదితర 60 మంది రక్తదాన ప్రేరేపకులకు, వ్యక్తిగతంగా అధికసార్లు రక్తదానం చేసిన కండ్లగుంట మధుబాబు నాయుడు, ఆర్టీసీ రవికుమార్ తదితరులను జ్ఞాపిక, శాలువా తో యంయల్ఏ కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా సత్కరించారు
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ వాకాటి విజయకుమార్ రెడ్డి, రోటరీ ఇంటర్నేషనల్ 3160 జిల్లా కార్యదర్శి డాక్టర్ కె మాధవరెడ్డి, ఐయంఏ కార్యదర్శి డాక్టర్ వి గోపి, కావలి రెడ్ క్రాస్ చైర్మన్ డి రవిప్రకాష్, వైస్ చైర్మన్ కె హరినారప రెడ్డి, కోశాధికారి ఆరికట్ల మధుసూదనరావు, పాలకమండలి సభ్యులు మద్దుల నరసింహారావు, గొట్టిపాటి మనోరమ, ఇలింద్ర శ్రీవాణి, ఓరుగంటి వెంకటేశ్వర్లు, యన్ ప్రణీత్, డాక్టర్ పి శ్రీధర్, బెజవాడ ప్రసన్నకుమార్, జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు, కార్యదర్శి గాదిరెడ్డి హరనాథ్, జి మురళీకృష్ణ గాయకులు యస్ రామచంద్రరావు, యస్ రమణయ్య, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.