ప్రతి రైతు కుటుంబానికి భరోసా కలిగించేలా పాలన కొనసాగుతుంది
- సూపర్ సిక్స్ లో చెప్పిన ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నాం
- కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
- కావలి నియోజకవర్గంలో రూ.12,03,55,000 అన్నదాత సుఖీభవ- పిఎం కిసాన్ నిధులు విడుదల
- అధికారులతో కలిసి మెగా చెక్కును రైతులకు అందజేసిన ఎమ్మెల్యే
ప్రతి రైతు కుటుంబానికి భరోసా కలిగించేలా పాలన కొనసాగుతుందని, ప్రతి రైతుకు అండగా ఉంటానని ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు. శనివారం కావలి పట్టణంలో కలయిక కల్యాణమండపం లో అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. కావలి నియోజకవర్గానికి రూ.12,03,55,000 రూపాయలు మంజురు కావడంతో మెగా చెక్కును అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అర్హులైన ప్రతి రైతు అకౌంట్ లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. కావలి చరిత్ర లో ఎన్నడు లేని విధంగా రైతులకు రెండో కారు పంటకు నీరు ఇవ్వడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రకృతి పులకించిపోయి సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి అన్నారు. జిల్లా లో సోమశిల, కండలేరు డ్యామ్ లు రావడానికి కారణం టీడీపీ ప్రభుత్వమని, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కృషి ఫలితమని అన్నారు. నేడు కావలి నియోజకవర్గంలో అన్ని చెరువుల్లో పుష్కలంగా నీరు ఉన్నాయన్నారు. రైతుల భవిష్యత్తు బాగుండాలనే ఆశయంతో 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. రైతులకు సహాయం చేయడం మా ప్రభుత్వ ధ్యేయమని, రైతుల పట్ల శ్రద్ద చూపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, పీఎం మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 6,000 రూపాయల సాయాన్ని అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలను మూడు విడతల్లో చెల్లించనుందన్నారు. మొదటి విడతగా 7,000 రూపాయలు రాష్ట్రవ్యాప్తంగా 47 లక్షల రైతు కుటుంబాల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. పంట సాగు కోసం నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, మందులు సబ్సిడీలో అందించనున్నట్లు పేర్కొన్నారు. నీటి వనరులు, వర్షపాతం ఈ సీజన్‌లో అనుకూలంగా ఉండటంతో రైతులకు అనుకూల పరిస్థితులు ఏర్పడినట్లు తెలిపారు. గత ఐదేళ్లలో రైతులు ఎదుర్కొన్న కష్టాలు తిరిగి రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 24 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం ప్రభుత్వ కట్టుబాటుకి నిదర్శనమని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రైతుల సమస్యలను అర్థం చేసుకోకుండా, దోచుకునే పాలన సాగించాయన్నారు. మేము రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, మంత్రులు కలిసి రైతుల సమస్యలను పరిశీలించి పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, రైతులు, రైతు నాయకులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు...