కొండ బిట్రగుంట దేవస్థానం అభివృద్ధికి శ్రీకారం చుట్టిన కావలి ఎమ్మెల్యే..
ముమ్మరంగా కొండ బిట్రగుంట ఆలయ అభివృద్ధి పనులు..కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..
విపిఆర్ దాతృత్వంతో.. కొండబిట్రగుంటకు కొత్త శోభ
- శోభాయమానం.. బిలకూటక్షేత్రం
- అంగరంగ వైభవంగా విపిఆర్ దంపతుల చేతులమీదుగా కోనేరుకు శంకుస్థాపన
- భక్తుల కలను సాకారం చేస్తున్న వేమిరెడ్డి దంపతులు
- కోనేరు నిర్మాణం పూర్తికి రూ.2.10 కోట్ల విరాళం
- వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు పూర్తి చేయాలని నిర్ణయం
- వేంకటేశ్వరస్వామికి సేవ చేయడం మా పూర్వజన్మ సుకృతం
- 1.65 కోట్లతో మహా ప్రాకార నిర్మాణానికి శంకుస్థాపన
ఆధ్యాత్మికతకు సరికొత్త రూపం ఇస్తూ.. దాతృత్వంలో ఉన్నత శిఖరాన ఉన్న వేమిరెడ్డి దంపతులు మరో గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారు వెలిసిన కొండబిట్రగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి కోనేరు పునరుద్ధరణకు తమవంతుగా 2.10 కోట్ల విరాళం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మికానందాల నడుమ కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారితో కలిసి ఆదివారం కోనేరు శంకుస్థాపన కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు పాల్గొని శంకుస్థాపన చేశారు. అలాగే దేవాదాయ నిధులు 1.65 కోట్లతో ఆయన మహా ప్రాకారానికి కూడా శంకుస్థాపన పూర్తి చేశారు.
ముందుగా ఆలయానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి గారు, ఆలయ అర్చకులు, స్థానిక ప్రజలు పార్టీ నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవారిని దర్శించుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల వేదాశీర్వాదం అందుకున్నారు. పూజల అనంతరం స్వామివారి వేంచేపుగా కోనేరు ప్రాంగణానికి రాగా.. వేమిరెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సతీమణి జ్యోతి గారితో కలసి ఆలయ మహా ప్రాకారానికి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం విపిఆర్ దంపతుల దాతృత్వంలో నిర్మించనున్న కోనేరుకు శంకుస్థాపన చేశారు.
శంకుస్థాపన అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆశీసులతో కోనేరు పునఃనిర్మాణానికి పూనుకోవడం పూర్వజన్మసుకృతమన్నారు. దాదాపు 2.10 కోట్లతో పుష్కరిణి నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వివరించారు. స్వామివారు తమకు ఇచ్చిన దాంట్లోనే ఇదంతా చేస్తున్నామన్నారు. స్వామివారి పుష్కరిణి బాధ్యత మాకు దక్కడం అదృష్టమన్నారు. 800 ఏళ్ల చరిత్ర ఉన్న స్వామివారి ఆలయం మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. కోనేరు అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్వామివారి ఆశీసులతో రాష్ట్రం, జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలని కోరారు. వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వివరించారు.
ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ.. ప్రసన్న వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని పలుమార్లు అనుకున్నానని, కానీ కుదరలేదన్నారు. ఇప్పుడు కోనేరు శంకుస్థాపన సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. శంఖు చక్రాలు తిరగేసి ఉండటం స్వామివారి ప్రత్యేకత అని చెప్పారు. ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి 15 కోట్ల నిధులు సాధించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. అలాగే టిటిడి తరఫున వేద పాఠశాల ఏర్పాటుపై చర్చిస్తామని ఎమ్మెల్యే విజ్ఞప్తికి స్పందించారు.
కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అడిగిన వెంటనే కాదనకుండా కోనేరు నిర్మాణానికి అంగీకరించిన వేమిరెడ్డి దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. దాతలు, ప్రభుత్వ సహకారంతో దాదాపు 15 కోట్ల నిధులతో ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. పాత కాలంలో బ్రిటిషర్లు స్వామివారి శక్తిని తగ్గించేందుకు తూర్పు దిశగా కాకుండా ఉత్తర దిశగా మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. అందుకే ఆ తప్పులను సరిదిద్దేందుకు ఇప్పుడు తూర్పు దిశగా మెట్లు, ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎంతోమంది దాతల సహకారంతో స్వామివారి ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సందర్భంగా టిటిడి ఆధ్వర్యంలో ఇక్కడ వేద పాఠశాల ఏర్పాటు చేయాలని టిటిడి బోర్డు మెంబర్ ప్రశాంతిరెడ్డికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రాధాకృష్ణ, కొండ బిట్రగుంట మాజీ చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి,టిడిపి కావలి ఏఎంసీ చైర్పర్సన్ పోతుగంటి అలేఖ్య, బోగోలు మండల కన్వీనర్ మలేపాటి నాగేశ్వరావు,సీనియర్ టీడీపి నాయకులు రావి విజయ్ కుమార్, ఇతర అధికారులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.