పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే పి-ఫోర్ లక్ష్యం - కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు
పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే పి-ఫోర్ లక్ష్యమని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. కావలి ఆర్డీవో కార్యాలయంలో బుధవారం పి-ఫోర్ కార్యక్రమంపై ఆర్డీవో సన్నీ వంశీ కృష్ణ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అట్టడుగులో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం కోసం ఈ పి-ఫోర్ కార్యక్రమాన్ని రూపొందించామని, ముఖ్యమంత్రి స్వయంగా పేద కుటుంబాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు.
ప్రతి ఒక్కరూ పేద వర్గాలకు మార్గదర్శకులుగా వ్యవహరించాలని కోరారు. కావలి నియోజకవర్గంలో 9000 పేద కుటుంబాలను గుర్తించినట్లు, గ్యాస్ కనెక్షన్లు లేని, ఇంకా కట్టెల మీద వంట చేసుకునే కుటుంబాలు అధికంగా ఉన్నాయని వివరించారు. ఈ కుటుంబాలను “బంగారు కుటుంబాలు”గా మార్చడం లక్ష్యంగా, ప్రతి కుటుంబానికి ఒక మార్గదర్శిని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు.
ఈ సందర్భంలో 1350 మంది పేద కుటుంబాలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారని ఆయన వెల్లడించారు. దత్తత ప్రక్రియపై ఉన్న అపోహలను తొలగిస్తూ, దీని వల్ల ప్రభుత్వాలు లేదా బ్యాంకులు ఇబ్బంది పెట్టవని స్పష్టం చేశారు. మన కుటుంబాలను మాత్రమే కాదు, పక్కింటివారిని కూడా ఆదుకోవాలి అని పిలుపునిచ్చారు. దేవుని సేవ కన్నా, మానవ సేవ గొప్పదని, సమాజంలో సేవ చేసే వ్యక్తులకు గౌరవం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనలో ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, ప్రజలు కలసి పనిచేస్తే సమాజం సంపన్నంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మార్గదర్శిలు, ప్రజలు, స్వచ్చంద సంస్థలు, తదితరులు పాల్గొన్నారు...