ఘనంగా మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు 05-09-2025 - ర్యాలీ లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
కావలి పట్టణంలో శుక్రవారం మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లింలు, హిందూ సోదర సోదరీమణులు కలిసి ఐక్యతకు నాంది పలికే ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ శాంతియుత వాతావరణంలో, మత సామరస్యానికి నిదర్శనంగా ఘనంగా సాగింది. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ముస్లిం సోదరులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జననం మానవాళికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ఆయన బోధనలు కేవలం ముస్లింలకే కాకుండా ప్రపంచ సమాజానికీ ఒక వెలుగుదీపమన్నారు. పవిత్ర ఖురాన్ రచన ద్వారా ఇస్లాం మతానికి, ఆచార సంప్రదాయాలకు నూతన దారిని చూపించారన్నారు. ఆయన జీవితమే త్యాగం, క్రమశిక్షణ, శాంతి, సహనం పాఠాలను మనకందించిందన్నారు. అదే విధంగా భారతదేశం అనేది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మరియు అన్ని మతాలు కలసికట్టుగా జీవించే దేశమన్నారు. ఖురాన్, భగవద్గీత, బైబిల్ మానవ సమాజానికి శ్రేయస్సు చెప్పే గ్రంథాలన్నారు. కావలి పట్టణంలో ముస్లిం సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో మిలాద్ ఉత్సవాన్ని నిర్వహించడం సర్వమత సామరస్యానికి ప్రతీకని ఎమ్మెల్యే అన్నారు. ముస్లిం సోదరుల ఆహ్వానం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, అందరూ పరస్పరం ప్రేమ, గౌరవాలతో జీవించాలని, సమాజంలో ఐక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, స్థానిక ప్రజలు, హిందూ సోదరులు, పట్టణ ప్రముఖులు విస్తృతంగా పాల్గొన్నారు.