సృష్టిలో గురువు స్థానమే అత్యున్నతం - కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
కావలి జడ్పి హైస్కూల్ కు పూర్వ వైభవాన్ని తీసుకొని వస్తాము. ప్రతి యేటా నియోజకవర్గ స్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిద్దాము కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
తల్లి జన్మనిస్తే, తండ్రి నడక నేర్పితే, జీవితాన్ని తీర్చిదిద్దేది గురువేనని, ఈ సృష్టిలో గురువు స్థానమే అత్యున్నతమని, గురువుని పూజించడం అనేది ముల్లోకాల పూజతో సమానమని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి ఉపాధ్యాయుల ప్రాధాన్యతను వివరిస్తూ విశేషంగా మాట్లాడారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఉపాధ్యాయుడు ఏ స్థాయికి ఎదగగలడో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం తార్కాణమన్నారు. ఆయన ఉపాధ్యాయ వృత్తి నుంచి ప్రారంభించి ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవులను అలంకరించారన్నారు. అందుకే 1962 నుంచి ఆయన జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఎమ్మెల్యే అన్నారు. తాను కూడా ఉపాధ్యాయ వృత్తితోనే జీవితాన్ని ప్రారంభించానని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు.
కావలి జె.బి. కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసిన రోజులు మరువలేనివన్నారు. విద్యార్థుల మనసులను గెలుచుకోవడానికి ఉపాధ్యాయుని వాక్చాతుర్యం, ప్రవర్తన, క్రమశిక్షణ, నవ్వు అన్నీ కలగలవాలని, అప్పుడు మాత్రమే ఆయన బోధించిన పాఠాలు విద్యార్థుల హృదయాల్లో నిలిచిపోతాయని అన్నారు. కావలి జడ్పి హై స్కూల్‌కి దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉందని, దానిని మోడల్ స్కూల్‌గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌తో చర్చించి, నిధులను సమీకరించే ప్రక్రియలో ఉన్నామని చెప్పారు.
గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్‌లో చెరో 1200 మంది విద్యార్థులు చదువుకునే విధంగా తరగతి గదులు, ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే దాతల సహకారంతో నిధుల సమీకరణకు చర్యలు ప్రారంభించామని వివరించారు. ఉపాధ్యాయులు లక్షలాది మంది జీవితాలను తీర్చిదిద్దగలరని, చెడిపోయే వ్యక్తిని సక్రమ మార్గంలో నడిపించేది గురువేనని, అందుకే ఉపాధ్యాయ వృత్తి సమాజంలో అత్యున్నతమైనదని అన్నారు. రాబోయే రోజుల్లో విద్యా విధానంలో మరిన్ని మార్పులు తీసుకొచ్చే కృషి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఆయన తెలిపారు.
ప్రతి సంవత్సరం నియోజకవర్గ స్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని ఉపాధ్యాయుల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచిస్తూ, వాటికి అయ్యే ఖర్చు మొత్తాన్ని తానే భరించేందుకు సిద్ధమని ఎమ్మెల్యే ప్రకటించారు. గురుదక్షిణగా ఇది నా కర్తవ్యమని భావిస్తున్నాని, మీ అందరితో కలిసి విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. ఎమ్మెల్యేగా కాదు, గురువుగా మీ వెనక నడవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు.. ఉత్తమ ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు బండి గోవిందయ్య, వెంకట సుబ్బయ్య, కావలి ఏఎంసి చైర్మన్ పోతుగంటి అలేఖ్య, ఎంపీడివో శ్రీదేవి, టిటిపి కావలి పట్టణ టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, పొట్లూరు శ్రీనివాసులు, కండ్లకుంట మధుబాబు నాయుడు, నాయుడు రాంప్రసాద్, టీచర్స్ యూనియన్ నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..